యువకుడితో పారిపోయి పరువు తీసిందని, మైనర్ కూతురి తల నరికిన తండ్రి, అతడికి తక్కువ శిక్ష వేశారని విమర్శలు

  • Published By: naveen ,Published On : August 30, 2020 / 04:33 PM IST
యువకుడితో పారిపోయి పరువు తీసిందని, మైనర్ కూతురి తల నరికిన తండ్రి, అతడికి తక్కువ శిక్ష వేశారని విమర్శలు

Updated On : August 30, 2020 / 5:10 PM IST

ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లోనూ కొందరు పరువు, ప్రతిష్ట, కులం పేరుతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టిన పిల్లల కన్నా కొందరికి పరువు, ప్రతిష్టలే ముఖ్యంగా మారాయి. పరువు పేరుతో కన్న పిల్లలనే కడ తేరుస్తున్నారు. మన దేశంలోనే కాదు ఇరాన్ లో అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తన మైనర్ కూతురు 28 ఏళ్ల యువకుడితో పారిపోయి తన పరువు తీసిందనే కోపంతో ఆ కసాయి తండ్రి కన్న కూతురి తల నరికేశాడు.

కన్నకూతురి తల నరికేస్తే ఇంత తక్కువ శిక్షా:
కొన్ని నెలల క్రితం గిలాన్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసుకి సంబంధించి ఇటీవలే దోషికి శిక్ష ఖరారైంది. దోషికి 9 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ కసాయి తండ్రికి విధించిన శిక్ష ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్నకూతురి(14) తల నరికేసిన ఇరాన్ జాతీయుడికి కేవలం తొమ్మిదేళ్ల జైలు శిక్షే పడటంతో ఇరాన్ చట్టాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలకు పురుషులే రక్షకులుగా భావించే సమాజంలో పురుషుల హక్కులకే ఎక్కువ ప్రధాన్యాత లభిస్తోందంటూ అంతర్జాతీయ న్యాయనిపుణుల నుంచి విమర్శలు వస్తున్నాయి.