హంతకురాలు గుండెపోటుతో చనిపోయినా ఉరిశిక్ష అమలు, కోడలిపై కసి తీర్చుకున్న అత్త

Iranian woman sentenced to death: ఆమె ఓ హంతకురాలు. భర్తను చంపిన కేసులో ఉరిశిక్ష పడింది. ఉరికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో ఉరి తియ్యాల్సి ఉంది. ఇంతలోనే ఆమె తీవ్రమైన గుండెపోటుతో మరణించింది. అయినా నిబంధనల ప్రకారం ఉరిశిక్ష అమలు చేశారు.
భర్త చంపిన భార్యకు మరణశిక్ష:
ఇరాన్ లో ఈ ఘటన జరిగింది. జహ్రా ఇస్మాయిలీ అనే మహిళ భర్తను చంపిన నేరానికి జైలుపాలైంది. ఆమె హత్య చేసినట్టు నిరూపితం కావడంతో కోర్టు మరణశిక్ష విధించింది. ఆమె భర్త ఇరాన్ ఇంటెలిజెన్స్ శాఖలో అధికారి. తనను, కుమార్తెను దూషిస్తుండడంతో జహ్రా ఇస్మాయిలీ భర్తను అంతమొందించింది.
ఉరికి ముందే గుండెపోటు:
నేరం నిరూపితం కావడంతో కరాజ్ పట్టణంలోని రజాయ్ షహర్ జైల్లో ఉరికి ఏర్పాట్లు చేశారు. జహ్రా కంటే ముందు 16 మంది దోషులను ఉరితీశారు. వారందరి మరణయాతనను స్వయంగా చూసిన జహ్రా తీవ్రమైన గుండెపోటుకు గురైంది. వైద్యసాయం అందేలోపే ప్రాణాలు విడిచింది. అయితే, ఆమె అత్త మాత్రం తన కుమారుడిని చంపిన కోడలిపై కసితో రగిలిపోయింది. జహ్రా చనిపోయినప్పటికీ ఆమె కూర్చున్న కుర్చీని తన్నేయడంతో ఉరితీత పూర్తయింది.
ఇరాన్ లో ఉరిశిక్ష పడిన దోషుల ఉరితీతలో పాల్గొనేందుకు బాధితుల బంధువులను అనుమతిస్తారు. ఉరికంబం దగ్గర దోషులు కూర్చున్న కుర్చీని తన్నేసే హక్కు వారికి లభిస్తుంది. తద్వారా తమకు న్యాయం జరిగిందన్న భావనతో పాటు, తమ చేతులతోనే దోషిని చంపామన్న తృప్తి కూడా లభిస్తుంది.
Omid Moradi, the lawyer of a woman recently executed in #Iran says she suffered a fatal stroke after witnessing 16 men being hanged & authorities hanged her dead body. #ZahraEsmaili mother of 2 was found guilty of killing her husband who was a high ranking intel official. pic.twitter.com/9tnNObXGyF
— IRAN HRM (@IranHrm) February 19, 2021