Iran Peace Talks: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం.. అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ..!
ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై తలపెట్టిన దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Iran Peace Talks: పశ్చిమాసియా యుద్ధం ఓ కొలిక్కి రానుందా..? అమెరికాతో చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉందా? అంటే అవుననే అంటున్నాయి ఇజ్రాయెల్ వర్గాలు. అమెరికాతో సంధి కుదుర్చుకునే దిశగా చర్చలు జరిపేందుకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరగ్చి అమెరికా రాయబారి స్టీవ్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని షరతులకు అంగీకరిస్తేనే యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా వున్నట్లు మొదటి నుంచి కూడా ఇరాన్ చెబుతున్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్‌కు చెందిన యెడియోత్ అహ్రోనోత్ను ఉటంకిస్తూ వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఒక ఒప్పందానికి రావడానికి ఉద్దేశించిన చర్చలకు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆమోదం తెలిపారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్కు తెలియజేసినట్లు సమాచారం.
ఇటీవలి అమెరికా-ఇజ్రాయెల్ సంఘర్షణ ప్రారంభ దశలో అలీ ఖమేనీ మరణం తర్వాత నాయకత్వం చేపట్టిన ఖమేనీ.. ఇరాన్ షరతులకు లోబడి యుద్ధాన్ని త్వరితగతిన ముగించడానికి సుముఖంగా ఉన్నారని నివేదికలో పేర్కొన్న వర్గాలు తెలిపాయి.
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి 48 గంటల అల్టిమేటం ఇచ్చిన అనంతరం, ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై తలపెట్టిన దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్ సుప్రీం లీడర్ తో నేరుగా కాకపోయినా ఒక “అగ్రశ్రేణి వ్యక్తి”తో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెప్పారు. అయితే, ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ ఖండించడంతో గందరగోళం నెలకొంది. కొన్ని రోజుల్లోనే ఒక ఒప్పందం కుదరవచ్చని, పరిస్థితులు చాలా బాగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పడం విశేషం.
ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు దిగాయి. ఇరాన్ కూడా తగ్గేదేలే అంటూ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్ల వర్షం కురిపించింది.
Also Read: యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుంది: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. జనం ప్రిపేర్ అవ్వాల్సిందేనా?
