Ain Dubai
Ain Dubai: ప్రపంచంలో ఎన్నో వింతలకు వేదికగా ఉంటుంది దుబాయ్.. ఇసుక దిబ్బలతో నిండివున్న ఈ దేశం యాభైయేళ్ల వ్యవధిలో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ఆధునికతలో పక్కన ఉన్న ఎడారి దేశాలను వెనక్కు నెట్టి ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడుతుంది.
ఇప్పటికే ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా ఈ దేశంలోనే ఉంది. మరోవైపు ఖర్జురపు చెట్టు ఆకారంలో ఉండే కృత్రిమ దీవిని ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షిస్తుంది. తాజాగా ఓ భారీ స్విమ్మింగ్ పూల్ ని కూడా నిర్మించింది. ఇది ప్రపంచంలోనే లోతైన స్విమ్మింగ్ పూల్.. దీనిని జులై నెలలో ప్రారంభించారు. ఈ స్విమ్మింగ్ పూల్ లో గంటపాటు స్విమ్ చెయ్యాలి అంటే 109 అమెరికన్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే భారత్ నుంచి వెళ్లిన పర్యాటకులు ఈ పూల్ లో స్విమ్ చేశారు.
ఇక ఇప్పుడు మరో భారీ నిర్మాణంతో పర్యాటకులను ఆకర్శించేందుకు దుబాయ్ సిద్ధమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద, ఎత్తయిన అబ్జర్వేషన్ వీల్ సిద్ధమైంది. దీని పేరు ఐన్ దుబాయ్( Ain Dubai ). దీనిని అక్టోబర్ 21న ప్రారంభించనున్నట్లు యూఏఈ ప్రకటించింది. లండన్ ఐ ఎత్తు కంటే ఇది రెట్టింపు ఉండటం విశేషం. టూరిస్టులను గరిష్ఠంగా 250 మీటర్ల ఎత్తు వరకూ ఇది తీసుకెళ్తుంది.
అక్కడి నుంచి వాళ్లు దుబాయ్ నగర అందాలను వీక్షించవచ్చని గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ తెలిపింది. ఈ ఐన్ దుబాయ్ బ్లూవాటర్స్ ఐలాండ్‌లో ఉంది. ఇక ఇది ఒక రౌండ్ తిరిగి రావాలంటే 38 నిమిషాల సమయం పడుతుంది. యూఏఈ 50వ ఏడాదిలో అడుగుపెడుతున్న సందర్బంగా దీనిని ప్రారంభించనున్నట్లు దుబాయ్ హోల్డింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీవోవో మహ్మద్ షరఫ్ అన్నారు.