"Remain Vigilant" says India
Ministry of External Affairs on Taiwan issue: చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయంపై భారత్ స్పందించింది. ఇవాళ విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తైవాన్ జలసంధి విషయంలో ఉన్న యథాపూర్వస్థితి (status quo)ని మార్చేలా చర్యలకు పాల్పడవద్దని చెప్పారు. శాంతి, స్థిరత్వం కొనసాగేలా కృషి చేయాలని అన్నారు. చైనా-తైవాన్ మధ్య నెలకొన్న ప్రతికూల పరిస్థితులపై ఇతర దేశాలలాగే భారత్ కూడా ఆందోళన చెందుతోందని చెప్పారు.
ఉద్రిక్తతలు తగ్గేలా కృషి చేయాలని, సైనిక విన్యాసాలు ఆపాలని కోరారు. వన్ చైనా పాలసీపై భారత ఉద్దేశం ఏంటని అడిగిన ప్రశ్నకు బాగ్చి స్పందిస్తూ.. భారత విధానాలు అందరికీ తెలుసని, అవి స్థిరంగా ఉంటాయని, వాటి గురించి పదేపదే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, చైనా చేపట్టిన సైనిక విన్యాసాలకు దీటుగా తైవాన్ కూడా యుద్ధ సన్నాహాలు చేసుకుంటుండడంతో ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి.
తైవాన్ సైన్యం ఇటీవల రెండు సార్లు పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టింది. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటించిన నేపథ్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. చైనా చేపట్టిన సైనిక విన్యాసాలు ముగిసినప్పటికీ యుద్ధ సన్నాహాలు కొనసాగుతాయని డ్రాగన్ దేశం ప్రకటించింది. చైనా నుంచి ముప్పు పొంచి ఉండడంతో తైవాన్ అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకుంటోంది.