Canada: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ.. ఆయన ఎవరు..? ట్రంప్ హెచ్చరికలపై ఏమన్నారో తెలుసా..
కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి కెనడా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

Mark Carney
Mark Carney: కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి కెనడా ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కార్నీ వయస్సు 59ఏళ్లు. పార్టీ నేత ఎంపికకు జరిగిన ఎన్నికలో 86శాతం ఓట్లు సాధించి లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మొత్తం లక్షన్నర మంది లిబరల్ పార్టీ సభ్యులు పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్నారు. మార్క్ కార్నీకి 1,31,674ఓట్లు రాగా.. క్రిస్టియా ఫ్రీలాండ్ కు 11,134, కరినా గౌల్డ్ కు 4,785, ఫ్రాంక్ బేలిస్ కు 4,038 ఓట్లు వచ్చాయి. దాదాపు 86శాతం పార్టీ సభ్యుల మద్దతుతో తదుపరి ప్రధానిగా కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు.
పార్టీలోని మెజార్టీ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు.. తన పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నెలలో ప్రధాని పదవి నుంచి జస్టిన్ ట్రూడో వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో విజయం సాధించిన కార్నీ.. కెనడా దేశం 24వ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టనున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనికితోడు కెనడాపై సుంకం విధించే ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. మార్చి 4 నుంచి అవి అమల్లోకి వచ్చాయి. అయితే, త్వరలో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘ఒట్టవా ఏ విధంగానూ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాదు. తమ దేశం అప్పటికీ, ఇప్పటికీ బలంగా ఉంది. వాణిజ్యం అయినా, క్రీడలు అయినా చివరికి విజయం సాధించేది కెనడానే’’ అని కార్నీ పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో కఠినమైన రోజుల్లో నాయకులు, ప్రజలు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ కలిసికట్టుగా ముందుకుసాగాలని కార్నీ పిలుపునిచ్చారు. అందరి సహకారంతోనే కెనడా సంక్షోభాలను అధిగమిస్తుందని చెప్పారు. అమెరికా మాకు గౌరవం చూపించే వరకు మా ప్రభుత్వం మా సుంకాలను కొనసాగిస్తుందని కార్నీ అన్నారు.
మార్క్ కార్నీ ఎవరు?
♦ మార్క్ కార్నీ 1965లో ఫోర్ట్ స్మిత్ లో జన్మించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ లో ఉన్నత విద్య అభ్యసించారు.
♦ గోల్డ్ మాన్ శాక్స్ లో 13ఏళ్లు పాటు పనిచేశారు.
♦ 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్ గా ఎన్నికయ్యారు. సంవత్సరం పాటు ఆ పదవిలో కొనసాగిన కార్నీ 2004లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
♦ 2008 ఫిబ్రవరి నెలలో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గా నియమితులయ్యారు.
♦ 2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అయితే, మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ సెంట్రల్ బ్యాంక్ కు మొట్టమొదటి నాన్ బ్రిటీష్ గవర్నర్ గా నిలిచారు.
♦ 2020లో ఐక్య రాజ్య సమితిలో ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు.
♦ ట్రూడో ప్రభుత్వం కార్నీ పనిచేసినప్పటికీ ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కు అధ్యక్షుడిగా ఉన్నారు.