యమెన్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు :కొత్త కేబినెట్ టార్గెట్ గా దాడి…16మంది మృతి

Massive explosion rocks Aden airport in Yemen; 16 dead, 60 injured మయెన్ దేశంలోని ఆడెన్ సిటీలోని విమానాశ్రయంలో బుధవారం(డిసెంబర్-30,2020) భారీ పేలుడు సంభవించింది. కొత్తగా ఏర్పాటైన కేబినెట్ మంత్రులతో వచ్చిన విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అక్కడ పేలుడు జరిగిందని భద్రతా అధికారులు తెలిపారు. పేలుడు శబ్దం వినబడగానే అక్కడున్న ప్రజలు,సెక్యూరిటీ అధికారులు పరుగులు దీశారు. ఈ ప్రమాదంలో 16మంది మరణించగా..60మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఘటనాస్థలంలో లభ్యమైన ఫుటేజీలో…ప్రభుత్వాధికారుల బృందం పేలుడు శబ్దం రావడంతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ విమానంలో ఉన్న ఏ ఒక్కరూ గాయపడలేదని సమాచారం. అయితే చాలామంది మంత్రులు కాపాడండా..రక్షించండి అంటూ విమానం వెనుకవైపు పరుగులు తీశారు. అయితే విమానాశ్రయంలో పేలుడికి గల కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. ఎయిర్ పోర్ట్ పై దాడికి తమదే బాధ్యత అని ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.
ప్రభుత్వ విమానంలో ఉన్న యమెనీ కమ్యూనికేషన్ మంత్రి నగౌబ్ అల్ అవగ్ మాట్లాడుతూ…తాను రెండు పేలుళ్ల శబ్దాలను విన్నానని..అవి డ్రోన్ దాడులుగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. యమెన్ ప్రధాని మయీన్ అబ్దుల్ మాలిక్ సయూద్ మరియు ఇతర నేతలు వెంటనే విమానాశ్రయం నుంచి సిటీలోని యాషిక్ ప్యాలెస్ కి తరలించబడ్డారని తెలిపారు. ఒకవేళ విమానం గనుక పేలిపోయినట్లయితే అదొక విపత్తుగా మిగిలిపోయేదని అన్నారు. విమానాన్ని పేల్చేయాలనే లక్ష్యంతోనే దాడి జరగిందని తెలిపారు. కాగా,ఎయిర్ పోర్ట్ లో బాంబ్ బ్లాస్ట్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి.