ఈయేడాదే కరోనా వ్యాక్సిన్, Moderna కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ మొదలుపెట్టింది

అమెరికాకు చెందిన మోడెర్నా కరోనావైరస్ వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టేసింది.. జూలై 14న ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో వ్యాక్సిన్ మొదటి ప్రారంభ దశ ట్రయల్‌కు సంబంధించి ప్రాథమిక నివేదిక ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ కరోనావైరస్‌ను నిరోధించగల యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని తెలిపింది.
ఇందులో ప్రయోగాత్మక టీకా తీసుకున్న వారిలో చాలామందిలో చిన్నపాటి దుష్ప్రభావాలు కనిపించినట్టు పేర్కొంది. డాక్టర్ ఆంథోనీ ఫౌసీ నేతృత్వంలోని యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఈ ట్రయల్ నిర్వహించింది. కరోనా నుంచి కోలుకున్న రోగులలో కనిపించే దానికంటే షాట్ తీసిన వారిలో తయారైన యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించారు.
రోగనిరోధక ప్రతిస్పందనను అభివృద్ధి చేయడానికి మొదటి షాట్ తర్వాత 4వారాల తర్వాత రెండవ షాట్ అవసరమని కంపెనీ భావిస్తోంది. COVID-19 మహమ్మారిని భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తమ mRNA వ్యాక్సిన్ సాయపడుతుందని నమ్ముతున్నామని మోడరనా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టెఫాన్ బాన్సెల్ చెప్పారు.
mRNA వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? :
mRNA అని పిలిచే వైరస్ నుంచి జన్యు పదార్థాన్ని సేకరిస్తారు. ఈ పద్ధతి ఇప్పటివరకు వ్యాక్సిన్‌ను రూపొందించడానికి వినియోగించలేదు. mRNA అనేజన్యు క్రమాన్ని వినియోగిస్తున్నారు. మెసెంజర్ RNA చిన్నదిగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచేలా శరీర కణాలను నిర్దేశిస్తుంది.
SARS, MERS వంటి సంబంధిత కరోనావైరస్ మునుపటి అధ్యయనాలను ఉపయోగించి ఈ టీకాను అభివృద్ధి చేశారు. ఇప్పటికే జంతువుల శాంపిల్స్ లోనూ పరీక్షించారు. MRNA-1273 NIAID నేతృత్వంలో మొదటి దశ అధ్యయనంలో మార్చి 16న ఒక వాలంటీర్‌కు మొదటి మోతాదును ఇచ్చారు. ఆ తర్వాత రెండో దశ ట్రయల్‌లో 600 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లు పాల్గొన్నారు.