Earthquake: మియన్మార్, థాయిలాండ్‌లో భూకంపం.. 1000 దాటిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద వందలాది మంది.. మరోసారి ప్రకంపనలు..

మియన్మార్, థాయిలాండ్ లలో సంభవించిన భారీ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది..

Earthquake: మియన్మార్, థాయిలాండ్‌లో భూకంపం.. 1000 దాటిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద వందలాది మంది.. మరోసారి ప్రకంపనలు..

Myanmar Thailand Earthquake

Updated On : March 29, 2025 / 11:54 AM IST

Earthquake Myanmar: భారీ భూకంపం కారణంగా మియన్మార్, థాయిలాండ్ లు అతలాకుతలం అయ్యాయి. పలు ప్రాంతాల్లో భవనాలు నేలకూలాయి. ఎటుచూసినా కూలిపోయిన భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. భారీ భూకంపం కారణంగా రెండు దేశాల్లో ఇప్పటికే మృతుల సంఖ్య 1000 దాటగా.. 2370 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఒక్క మియన్మార్ లోనే 694 మంది మరణించినట్లు ఆ దేశ మిలిటరీ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల్లో ఈ విప్తత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

భూకంపం కారణంగా ఇప్పటికే అతలాకుతలమైన మియన్మార్ లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం తెల్లవారు జామున 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు బ్యాంకాక్ లో భూకంపం కారణంగా 10మంది మరణించగా.. ఓ భారీ భవనం కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు.

 


మియన్మార్ లో ప్రకృతి వైపరిత్యాన్ని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి మద్దతును సేకరిస్తోంది. మియన్మార్, థాయిలాండ్ లలో భూకంప సహాయం, సహాయానికి సింగపూర్ రెడ్ క్రాస్ 150000 డాలర్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. ఈ నిధిని ఆహారం, నీరు, దుప్పట్లు, టార్పాలిన్, పరిశుభ్రత వస్తు సామాగ్రి, పలు ముఖ్యమైన వస్తువులను ప్రజలకు అందించేందుకు ఉపయోగించనుంనట్లు తెలిపింది. ఇప్పటికే భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద మయన్మార్ కు 15టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లను అందించింది. సహాయ, రక్షణ కార్యకలాపాల కోసం రష్యా 120 మంది సభ్యుల బృందాన్ని పంపించింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ముందుకొచ్చాయి.