Natalie A Baker : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న నటాలీ.. ఎవరీమె.. ఎందుకింత క్రేజ్..!
Natali A Baker : ఒక రెండు, మూడు రోజులుగా నటాలీ బేకర్ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె అంటే..
Natali A Baker Diplomat who Trending in social media After US Iran Talks
Natali A Baker : అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో.. ప్రపంచానికి అర్థం కాకుండా పోయింది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం యుద్ధ విరమణ కోసం అమెరికా-ఇరాన్ దేశాల మధ్య పాకిస్తాన్ వేదికగా మధ్యవర్తిత్వ చర్చలు జరిగాయి. వీటి ఫలితం ఎలా ఉన్నా.. ఈ చర్చలు జరిగిన నాటి నుంచి ఓ మహిళ మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండ్ అవుతోంది. అసలు ఆమె ఎవరు.. ఆమె విధులు ఏంటి అనే వివరాలు తెలుసుకునేందుకు చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఇరాన్-అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్న వేళ అక్కడ చురుకుగా కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ఆమె పేరు నటాలీ ఎ. బేకర్. దౌత్యవేత్త అయిన ఆమె ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు.
నటాలీ ప్రస్తుత హోదా:
నటాలీ అమెరికా ఫారెన్ సర్వీస్‌లో సీనియర్ సభ్యురాలు మాత్రమే కాక దౌత్యవేత్త కూడా. ప్రస్తుతం ఆమె ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో తాత్కాలిక రాయబారిగా విధులు నిర్వహిస్తున్నారు. 2024లో నటాలీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా ఇస్లామాబాద్‌కు వచ్చారు. 2025 నుంచి ఛార్జ్ డి అఫైర్స్ యాడ్ ఇంటెరిమ్ (సీఏడీ)గా రాయబార కార్యకలాపాలు, భద్రతకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
జనవరి 2025 నుండి అక్కడ పూర్తి స్థాయి రాయబారి లేకపోవడంతో, ఆమె సీనియర్ అమెరికన్ అధికారిగా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.విద్య, భద్రత, వాణిజ్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన రంగాల్లో అమెరికా-పాకిస్థాన్‌ల మధ్య సహకారాన్ని పెంచడానికి ఆమె కృషి చేస్తున్నారు.
ఎందుకు ట్రెండ్ అవుతున్నారు
ఇస్లామాబాద్‌లో అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన అత్యున్నత స్థాయి దౌత్య చర్చల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 11న జరిగిన ఈ చర్చల సమయంలో లాజిస్టిక్స్, భద్రత, దౌత్యపరమైన సమన్వయాన్ని ఆమె దగ్గరుండి చూసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఆమె వార్తల్లో నిలిచారు.
అనుభవం:
నటాలీ అమెరికా సీనియర్ ఫారిన్ సర్వీస్‌లో కెరీర్ మెంబర్.
పశ్చిమ ఆసియా మరియు ఉత్తర ఆఫ్రికా వ్యవహారాల్లో ఆమెకు అపారమైన అనుభవం ఉంది.
గతంలో లిబియా, కువైట్, ఖతార్ వంటి దేశాల్లో పనిచేశారు.
కీలక బాధ్యతలు:
- 2009-2011 మధ్య లిబియా విప్లవం సమయంలో అక్కడ పనిచేశారు.
- ఖతార్‌లోని దోహాలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా వ్యవహరించారు.
- దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ నుండి ఇరాన్ విధానానికి సంబంధించిన విధులను నిర్వహించారు.
విద్యార్హతలు:
- ఆమె ప్రిన్స్టన్ యూనివర్సిటీ మరియు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి పట్టాలు పొందారు.
- అలాగే యూఎస్ నేషనల్ వార్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు.
భాషా నైపుణ్యం:
నటాలీ బేకర్ అరబిక్, స్పానిష్, ఫార్సీ మరియు రష్యన్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు.
ఇరాన్-అమెరికా చర్చల వేళ ఓ సీనియర్ ఫారెన్ సర్వీస్ అధికారిణి చురుకుగా వ్యవహరించడం.. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లో నిలిచారు.
