పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 2వేలకు ఆయన ప్లేట్ లెట్స్ పడిపోయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. లాహోర్ లోని సర్పీసెస్ హాస్పిటల్ లో అక్టోబర్-21,2019నుంచి ఆయన ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.
కొద్దిరోజులుగా అల్ అజియా అవినీతి,మనీలాండరింగ్ కేసుల్లో పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న షరీఫ్ కు అనారోగ్యం దృష్యా ఇటీవల పాక్ కోర్టు రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనకు మంజూరు చేసిన బెయిల్ గడువు ఇవాళ(అక్టోబర్-29,2019)ముగియనుంది. షరీఫ్ ను డిస్ చార్జ్ చేసేందుకు డాక్టర్లు నిరాకరిస్తున్నారు. తాత్కాలిక బెయిల్ గడువు ముగియబోతున్న సమయంలో అల్ అజియా కేసులో షరీఫ్ కు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ లపై ఇస్లామాబాద్ హైకోర్టు (ICH) విచారణను తిరిగి ప్రారంభిస్తుంది.
తీవ్ర అనరోగ్యంతో హాస్పిటల్ లో చేరిన షరీఫ్ కు రెండు రోజుల క్రితం ట్రీట్ మెంట్ సమయంలోనే గుండెపోటు వచ్చింది. దాని కోలుకున్నట్లు అప్పుడు డాక్టర్లు చెప్పినప్పటికీ ప్లేట్ లెట్స్ సంఖ్య క్రమంగా తీవ్రమైన స్థాయికి పడిపోయినట్లు ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నారు. షరీఫ్ కు ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయనను ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తరలించేందుకు అనుమతిఇవ్వాలని కోర్టును ఇవాళ కోరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపునవాజ్ షరీఫ్‌కు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు.