Nepal Protest: నేపాల్‌లో నిరసనల వేళ.. జైలు నుంచి పారిపోయిన ఖైదీల్లో ఓ ఖైదీ మళ్లీ జైలుకు తిరిగొచ్చాడు.. ఎందుకో తెలుసా..
Nepal Protests : నేపాల్‌లోని పశ్చిమ ప్రావిన్సులోని కైలాలి రాజధాని ధంగాధి జైలు నుంచి ఖైదీలు పారిపోయారు.

Nepal Protests
Nepal Protest: నేపాల్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా Gen Z యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రధాన మంత్రి కేపి శర్మ ఓలీ తన పదవికిసైతం రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, నేపాల్‌లో ఉద్రిక్తతల వేళ ఆ దేశంలోని పలు జైళ్ల నుంచి సుమారు 1500 మంది ఖైదీలు పారిపోయారు.
నేపాల్‌లోని పశ్చిమ ప్రావిన్సులోని కైలాలి రాజధాని ధంగాధిలో నిరసనల సందర్భంగా నగర జైలు నుంచి దాదాపు 629 మంది ఖైదీలు మూడు రోజుల క్రితం పారిపోయారు. అయితే, వారిలో ఒక ఖైదీ మూడ్రోజుల తరువాత వెనక్కు వచ్చి జైలులో అధికారులకు లొంగిపోయాడు. అతను మళ్లీ జైలుకొచ్చి లొంగిపోవడానికి ప్రధాన కారణం ఉంది. ఆందోళనలు సద్దుమణిగి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జైలు నుంచి తప్పించుకున్న వారికి డబుల్ శిక్ష పడుతుందనే భయంతో అతను మళ్లీ జైలుకొచ్చి లొంగిపోయాడు.
ధంగాడి జైలులో ఘర్షణలకు ముందు 697 మంది ఖైదీలు ఉన్నారు. ఘర్షణల నేపథ్యంలో జైలు చాలా మంది ఖైదీలు పారిపోయారు. జైలులో ప్రస్తుతం లొంగిపోయిన వ్యక్తి.. ఘర్షణల సమయంలో పారిపోయి ఇంటికెళ్లాడు. అయితే, కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పి మళ్లీ జైలుకు తిరిగి పంపించారు.
జైలుకొచ్చిన తరువాత అతను మాట్లాడుతూ.. జైలు నుంచి వెళ్లిపోయిన తరువాత నేను స్వేచ్ఛగా ఉన్నప్పటికీ పోలీసులు తనను మళ్లీ పట్టుకుంటే అది జైలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తన కిందకు వస్తుంది. దీంతో తనకు జైలు శిక్ష పెరుగుతుంది. అందుకే నేను పారిపోయినప్పటికీ మళ్లీ జైలుకొచ్చి లొంగిపోయా అని చెప్పాడు.
అయితే, అతను లొంగిపోయేందుకు జైలుకొచ్చిన సమయంలో జైలుకు తాళం వేసి ఉంది. జైలు సిబ్బంది లోపల ఉన్నారు. బయట గేటుకు తాళం వేసి ఉంది. అతను జైలు గేటు వద్దకు వెళ్లి తాను లొంగిపోతాను.. మళ్లీ జైల్లోకి వస్తాను అంటూ చాలాసార్లు జైలు సిబ్బందిని పిలిచాడు. కానీ, అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఓ గార్డు అతని దగ్గరకు వచ్చి.. నువ్వు మళ్లీ జైల్లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నావ్ అని ప్రశ్నించాడు. విషయం చెప్పిన తరువాత ఆ ఖైదీని తిరిగి జైల్లోకి రానివ్వాలని గార్డు తన పైఅధికారికి తెలియజేశారు. అధికారుల అనుమతితో మళ్లీ అతను జైల్లోకి వెళ్లాడు.