Nepal Opposition Parties: నేపాల్ పార్లమెంట్ రద్దు..రాష్ట్రపతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి ప్రతిపక్ష కూటమి
నేపాల్ పార్లమెంట్ ను రద్దు చేస్తూ ఆ దేశ రాష్ట్రపతి బిద్యా దేవి భండారీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Nepals Opposition Parties To Move Court Against Presidents Decision
Nepal Opposition Parties నేపాల్ పార్లమెంట్ ను రద్దు చేస్తూ ఆ దేశ రాష్ట్రపతి బిద్యా దేవి భండారీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. పార్లమెంట్ రద్దును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఐదు ప్రతిపక్ష పార్టీల కూటమి నిర్ణయించింది. 149 మంది సభ్యుల మద్దతున్న దేవుబాను ప్రధానిగా నియమించాల్సిందని ప్రతిపక్ష కూటమి నేతలు పేర్కొన్నారు.
శనివారం ప్రతిపక్ష నేతల కూటమి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో… రాష్ట్రపతి, ప్రధాని… అప్రజాస్వామిక, రాజ్యాంగవిరుద్ధ, తిరోగమన, నియంతృత్వ చర్యలు తీసుకున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగంలోని అధికరణ 76(5) ప్రకారం మెజారిటీ సభ్యుల సంతకాలతో వినతి పత్రం సమర్పించినప్పటికీ రాష్ట్రపతి బిద్యా దేవి భండారీ రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చలేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా తాము కోరినప్పటికీ ప్రధాన మంత్రిని నియమించవలసిన రాజ్యాంగ బాధ్యతను బిద్యా దేవి పట్టించుకోలేదని తెలిపారు. బిద్యా దేవి ప్రధాని ఓలీ పక్షంవైపు ఉంటూ దురుద్దేశంతో పార్లమెంటును రద్దు చేయడం రాజ్యాంగంపైనా, ప్రజాస్వామ్యంపైనా దాడి చేయడమేనని ఆరోపించారు. ఈ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహదూర్ దేవ్‌బా, సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్‌పర్సన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ, సీపీఎన్-యూఎంఎల్ నేత మాధవ్ కుమార్ నేపాల్, జనతా సమాజ్‌బాదీ పార్టీ- నేపాల్ చైర్‌పర్సన్ ఉపేంద్ర యాదవ్, రాష్ట్రీయ జన మోర్చా చైర్‌పర్సన్ దుర్గ పౌడెల్ ఉన్నారు.
కాగా, నేపాల్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి శనివారం రద్దు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ను రద్దు చేసి, సత్వరమే ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ శుక్రవారం రాష్ట్రపతికి సిఫారసు చేయగా…పార్లమెంట్ ను శనివారం ఉదయం రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రకటన చేశారు. అంతకుముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని ఓలీతోపాటు, ప్రతిపక్ష నేత షేర్ బహదూర్ దేవ్‌బా వేర్వేరుగా రాష్ట్రపతిని కోరారు. వీరి విజ్ఞప్తులను బిద్యా దేవి తిరస్కరించారు. బలపరీక్షలో గెలిచేందుకు అవసరమైన సభ్యుల మద్దతు వీరిద్దరికీ లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికల తేదీలను రాష్ట్రపతి ప్రకటించారు. నవంబర్ 12, 19 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నేపాల్ రాజ్యాంగంలోని అధికరణ 76(7) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు.
అయితే, నేపాల్ లో పార్లమెంట్‌ను రద్దు చేయడం ఐదు నెలల్లో ఇది రెండోసారి. అధికార పార్టీలో కుమ్ములాటల నేపథ్యంలో ఓలీ సిఫార్సు మేరకు గతేడాది డిసెంబర్ 21న అధ్యక్షురాలు పార్లమెంట్‌ను రద్దు చేయగా, సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. అనంతరం బలపరీక్షలో ఓలీ ఓడిపోయినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయననే మళ్లీ ప్రధానిగా నియమించారు. అయితే కేపీ శర్మ ఓలి బలాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. అయితే ప్రతిపక్షాలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయి. నేపాల్ పార్లమెంట్‌లో 275 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది మద్దతు అవసరముంది.