Norway PM: కరోనా నిబంధనలు బ్రేక్ చేసిన నార్వే ప్రధానికి ఫైన్ వేసిన పోలీసులు

Norway Pm Fined For Breaking Corona Rules
Breaking Corona Rules : కరోనా మహమ్మారికి దేశ ప్రధాని అయినా.. సామాన్య పౌరుడైనా..ఒక్కటే. వచ్చిందంటే క్వారంటైన్ కు వెళ్లాల్సిందే. అలాగే కరోనా నిబంధనలు కూడా దేశాధ్యక్షుడికైనా సామాన్యులకైనా ఒక్కటేనంటూ ఏకంగా దేశ ప్రధానికే భారీ జరిమానా విధించారు పోలీసులు. ఇది మన భారత్ లో మాత్రం కాదు లెండి. ఇక్కడ అటువంటి సమానత్వాలు ఉండవనే విషయం తెలిసిందే. మరి ఎక్కడంటే..నార్వేలో. నార్వేలో చట్టాల అమలు ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
అక్కడి పోలీసులు కూడా అంతే..రూల్స్ పాటించటంలో ప్రధాని అయినా సామాన్యుడైనా ఒక్కటేనంటూ నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌కు జరిమానా విధించారు. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించి ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌కు జరిమానా వేశారు. పైగా దేశ ప్రధానే బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఎలా? ప్రధానే అలా చేస్తే ఇక సామాన్య పౌరులు నిబంధనలు ఎలా పాటిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ప్రజల్ని మరింత అప్రమత్తం చేయడానికే ప్రధాని అని కూడా చూడకుండా కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా వేశామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నార్వేలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగా ఒక ప్రదేశంలో 10 మంది కంటే ఎక్కువ గుమికూడొద్దని ఆదేశించారు. లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్ 60వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో 13 మంది మాత్రమే పాల్గొన్నారు. కానీ అంతమంది కూడా పాల్గొనకూడదని అక్కడి నిబంధన. ఇది కరోనా కట్టడి నిబంధనలకు విరుద్ధం. ఎటువంటి సమావేశానికైనా కేవలం 10మంది మాత్రమే హాజరవ్వాలనేది అక్కడి నిబంధన. కానీ ప్రధాని పుట్టినరోజు సమావేశంలో 13మంది పాల్గొన్నారు. అంటే నిబంధల సంఖ్య కంటే కేవలం ముగ్గురు మాత్రమే ఎక్కువయ్యారు. అయినా సరే రూల్ ఈజ్ రూల్ అంటూ జరిమానా విధించారు పోలీసులు.
దీనిపై ప్రధాని క్షమాపణలు కూడా చెప్పారు. చట్టం ముందు కొంతమందికి, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉన్నప్పటికీ.. ప్రధానికి జరిమానా విధించామని పోలీసులు తెలిపారు. నిబంధనల అమలులో ప్రధానే ముందుండాలని అభిప్రాయపడ్డారు. అందుకే 20,000 నార్వేజియన్ క్రౌన్స్ జరిమానాగా విధించామని తెలిపారు. దీంతో సామాన్య పౌరులు సైతం అప్రమత్తమై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని తెలిపారు.