చైనీయులను ఎక్కించుకోని న్యూయార్క్ క్యాబ్ డ్రైవర్లు

చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లోని చైనీయులకు కూడా కరోనా వైరస్ శాపంగా మారింది. చైనా దేశస్థులు ఎక్కడ కనిపించినా స్థానికులు వారిపై దాడులకు దిగుతున్న ఘటనలు ప్రపంచదేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలోని చైనాటౌన్ మెట్రో స్టేషన్‌లో చైనాకు చెందిన ఓ మహిళపై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్‌లో చైనా దేశస్థులను అమెరికన్లు దూషిస్తున్నారంటూ మరో న్యూస్ బయటికొచ్చింది. చైనీయుల వల్ల తమ దేశస్థులకు కరోనా సోకుతోందంటూ అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో చైనీయులు ఎక్కడ కనిపించినా వారిపై చిందులు తొక్కుతున్నారు
అయితే ఇప్పుడు న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ ప్రాంతానికి వెళ్లేందుకు క్యాబ్ డ్రైవర్లు జంకుతున్నారు. ఈ ప్రాంతంలో చైనా దేశస్థులు ఎక్కువగా జీవిస్తుండటమే దీనికి కారణం. ఫ్లషింగ్ ప్రాంతంలో 70 వేలకు పైగా చైనా దేశస్థులు నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని కస్టమర్లను ఎక్కించుకుంటే తమకు కూడా కరోనా వైరస్ సోకుతుందేమోనని క్యాబ్ డ్రైవర్లు భయపడుతున్నారు. ఆ ప్రాంతానికి వెళ్తే.. యాప్‌లో ఆన్‌లైన్ నుంచి ఆఫ్ లైన్‌కు వెళ్లిపోతున్నారు. తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి ఆన్‌లైన్‌కు వస్తున్నారు.
చైనీయులను ఎక్కించుకోకపోవడం బాధగా అనిపిస్తోంది. కానీ.. తమకు కూడా కుటుంబం ఉందని, చైనీయుల వల్ల వైరస్ వస్తే తమ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని క్యాబ్ డ్రైవర్లు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఫ్లషింగ్ ప్రాంతమే కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి వచ్చే ప్రయాణికులను సైతం క్యాబ్ ఎక్కించుకోడానికి డ్రైవర్లు భయపడుతున్నారు. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 16 మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఇందులో ఒక్క కేసు కూడా న్యూయార్క్ నుంచి నమోదు కాలేదు.
అయితే క్యాబ్ డ్రైవర్లు తమ పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ కొందరు చైనీయులుఆవేదన వ్యక్తం చేశారు. గత ఆదివారం తాను క్యాబ్ చేశానని,అతడు దగ్గర వరకు వచ్చి….తనను చూసి వెళ్లిపోయాడని,రైడ్ ను క్యాన్సిల్ చేశాడని అడా రోబిన్సన్ అనే మహిళ తెలిపింది. అంతేకాకుండా ఆ తర్వాత కూడా మరో క్యాబ్ చేశానని,అతను కూడా నన్ను చూసి పక్కనున్న సందులోనుంచి వెళ్లిపోయాడని రోబిన్స్ తెలిపింది.
అయితే క్యాబ్ డ్రైవర్ల వల్ల ఏ ఒక్కరైనా వివక్షకు గురైతే తగిన చర్యలు తీసుకుంటామంటూ ట్యాక్సీ అండ్ లిమోజిన్ కమిషన్ అధికారులు స్పష్టం చేశారు. క్యాబ్ డ్రైవర్లపై వివక్షకు సంబంధించి కేసులు నమోదైతే.. మొదటిసారి 500 డాలర్ల జరిమానా.. రెండో సరా 1000 డాలర్ల జరిమానాతో పాటు నెల రోజులు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. మూడో సారి కూడా కేసు నమోదైతే క్యాబ్ డ్రైవర్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.