pak doctor Cancel Rs 4.75 medical fees Canceled : ఆ దేవుడు మన కంటికి కనింపించడు. కానీ మన కంటికి కనిపించే దేవుడు డాక్టర్. రోగులకు పునర్జన్మనిచ్చే డాక్టర్లని ప్రాణం పోసే దేవుళ్లని చెప్పుకుంటాం. కానీ వైద్యం వ్యాపారం అయిపోయిన ఈరోజుల్లో ఓ డాక్టర్ నిజంగా దేవుడయ్యాడు. క్యాన్సర్ రోగుల పాలిట భగవంతుడయ్యాడు. డాక్టరయ్యా..నువ్వు దేవుడివయ్యా..మా జీవితాంతం నిన్ను కొలుచుకుంటామయ్యా అని కన్నీటితో కృతజ్ఞతలు చెబుతున్నారు క్యాన్సర్ బాధితులు.
వైద్యుడు ఒకరు క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించినందుకు తీసుకోవాల్సిన ఫీజును మాఫీచేసి నిజమైన దేవుడు అనిపించుకున్నాడు. దీంతో
అమెరికాలో నివసించే ఓ పాకిస్థాన్- అమెరికన్ డాక్టర్ ఒమర్ అతిక్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. 200 మంది క్యాన్సర్ రోగులు చెల్లించాల్సిన రూ.4.75 కోట్ల హాస్పిటల్ బిల్లులను రద్దు చేసి దేవుడిగా కీర్తించబడుతూ వార్తల్లో నిలిచారు ఒమర్ అతిక్.
డాక్టర్ ఒమర్ అతిక్. ఆంకాలజిస్ట్. ఆయన అమెరికాలో ఒక బిల్లింగ్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నాడు. గతంలో తనవద్ద క్యాన్సర్‌కు ట్రీట్ మెంట్ చేయించుకున్న బాధితులు తన క్లినిక్‌కు భారీగా బకాయిలు పడినట్లుగా గుర్తించాడు. తన రోగుల సంతోషం కోసం మెడికల్ బిల్లులు చెల్లించలేని రోగుల బిల్లులన్నీ రద్దు చేయాలని అనుకున్నాడు.
క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక నోట్‌తో ఈ విషయాన్ని సదరు రోగులకు పంపించి వాళ్లను సంతోషపెట్టాలనుకున్నారు డాక్టర్ ఒమర్. ఆ 200లమంది లిస్టు తయారు చేసుకుని మీరు బిల్లులు కట్టనక్కర్లేదని తెలుపుతూ..వాళ్లందరికి గ్రీటింగ్ కార్డులు కూడా పంపించాడు.
కాగా..డాక్టర్ అతిక్ గత 29ఏళ్లుగా అమెరికాలోని పైన్ బ్లఫ్‌లో అర్కాన్సాస్ క్యాన్సర్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అక్కడ చికిత్స తీసుకునే రోగుల్లో చాలామందికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. కానీ..అవి కాకుండా ఇతర ఫీజులకు సంబంధించి చాలామంది క్యాన్సర్ రోగులు చెల్లించాల్సిన బిల్లులు కట్టాల్సి ఉంది. ఈక్రమంలో డాక్టర్ అతిక్ తన క్లినిక్‌ను మూసివేయాలని అనుకున్నారు. దీంతో పేషెంట్ల బకాయిలను వసూలు చేయకుండా వాటిని మాఫీ చేయాలని పెద్ద మనస్సుతో ఆలోచించాడు.
క్యాన్సర్ నుంచి కోలుకున్నవారు హాస్పిటల్ బిల్లుల గురించి ఆలోచిస్తూ..మళ్లీ ఆందోళనకు గురవుతున్నారని తెలుసుకున్న డాక్టర్ అతిక్ మీరు కట్టాల్సిన బిల్లులేమి ఇక కట్టనక్కర్లేదని..దీనికి గురించి మీరు ఆందోళన పడి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని చెబుతూ గ్రీటింగ్ నోట్ లో రాశాడు.
ఈ సందర్భంగా డాక్టర్ ఒమర్ అతిక్ మాట్లాడుతూ..క్యాన్సర్ రోగులు చాలామంది డబ్బుల కోసం ఎన్నో ఇబ్బందులు పడిన విషయం నాకు తెలుసు.నా కెరీర్‌లో చాలామందిని చూశాను. తనకు కూడా ఆ బాధితుల నుంచి బిల్లులు వసూలు చేయటం చాలా ఇబ్బందిగా అనిపించిది. అందుకే నా కుటుంబసభ్యులతో చర్చించి 200లమంది రోగుల బిల్లులన్నీ రద్దు చేసినట్లుగా వారికి తెలిపానని..ఈ నిర్ణయం తీసుకున్నాక నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు డాక్టర్ ఒమర్ అతిక్.