Pakistan: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. పాకిస్తాన్ తిక్క కుదిరిందిగా..! ఆసిమ్ మునీర్ ముందు అతిపెద్ద సవాల్..
ఈ సంగతి బాగా తెలుసు కాబట్టే..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌తో ఓ ఆట ఆడుకుంటున్నారు.
Pakistan: పాకిస్థాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అపరిమితమైన రాజ్యాంగ అధికారాలు, ‘ఫీల్డ్ మార్షల్’ హోదాతో చక్రం తిప్పుతున్న ఆసిమ్ మునీర్ ఇప్పుడు తన జీవితంలోనే అత్యంత కఠినమైన దౌత్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘గాజా శాంతి దళం’లో పాక్ సైన్యం చేరాలా? వద్దా? అనే ప్రశ్న ఇప్పుడు ఇస్లామాబాద్‌ను కుదిపేస్తోంది.
ఒకవైపు ట్రంప్‌తో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, రాబోయే అమెరికా పెట్టుబడులు.. మరోవైపు సైన్యం గనుక గాజా గడ్డపై అడుగుపెడితే దేశంలో విరుచుకుపడే ఇస్లామిక్ గ్రూపుల ఆగ్రహం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న మునీర్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గాజాలో శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ తన సైన్యాన్ని పంపాలని ట్రంప్ యోచిస్తుండటమే ఇప్పుడు మునీర్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది.
ఈ మధ్యనే అపరిమిత అధికారాలు కట్టబెట్టారంటూ ప్రచారం జరిగిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పరిస్థితి దయనీయంగా ఉంది. దేశంగా పాకిస్థాన్‌ని అవమానించాల్సిన అవసరం లేదు కానీ..దాని పాలకులు..పాలసీ మేకర్లు చేసే దరిద్రపు దుర్మార్గాలతోనే ఎవరికైనా చిక్కులు..అందుకే ఆ దేశం అప్పు కోసం ప్రపంచ బ్యాంక్ ముందు పొర్లు దండాలు పెడుతున్నా ఎవరూ అయ్యో పాపం అనరు. ఎందుకంటే దాని రాత..తలరాత అలా రాస్తున్నారు అక్కడి లీడర్లు…!
ఈ సంగతి బాగా తెలుసు కాబట్టే..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌తో ఓ ఆట ఆడుకుంటున్నారు. దానికి ఓ బ్యాక్ గ్రౌండ్ లీడ్ స్టోరీ ఉంది..అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా.. ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ తర్వాత అక్కడ పునర్నిర్మాణ బాధ్యతలు చేపట్టాలి. దీని కోసం ముస్లిం దేశాల సైన్యాన్ని రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఈ ‘ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్’ (ISF)లో పాకిస్థాన్ సైన్యం కీలక పాత్ర పోషించాలని ట్రంప్ హుకుం జారీ చేశారు. ఇప్పటికే గత ఆరు నెలల్లో ట్రంప్, మునీర్ రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ విషయంపైనే వీరిద్దరూ వాషింగ్టన్‌లో మరోసారి కలవబోతున్నారు.
అలా ట్రంప్ వేసిన హుకుం దెబ్బకి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కి చుక్కలు కన్పించడం ఖాయమంటున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ స్నేహాన్ని కాపాడుకోవాలా? లేక ఇటు స్వదేశంలో భగ్గుమనే నిరసన జ్వాలలను ఆపాలా? అనే సందిగ్ధంలో చిక్కుకుని.. ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.
ట్రంప్ కోరికను కాదంటే ఆయన కోపానికి గురికావాల్సి వస్తుంది..
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్న తరుణంలో అమెరికా పెట్టుబడులు, భద్రతా సాయం చాలా అవసరం. ట్రంప్ కోరికను కాదంటే ఆయన కోపానికి గురికావాల్సి వస్తుంది. మరోవైపు గాజాకు సైన్యాన్ని పంపడం అంటే హమాస్ వంటి సంస్థలను నిరాయుధులను చేయడం. ఇది పాకిస్థాన్‌లోని ఇస్లామిక్ గ్రూపులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంది. అంతేకాదు..ముందసలు పాక్ ఆర్మీకి నిధులు అందించడం ఓ పెద్ద ఛాలెంజ్..
పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవలే రాజ్యాంగ సవరణలు చేసి మరీ ఆసిమ్ మునీర్‌కు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఆయనకు 2030 వరకు పదవీకాలం పొడిగించడమే కాకుండా జీవితాంతం ‘ఫీల్డ్ మార్షల్’ హోదాను, ఎటువంటి క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా జీవితకాల విముక్తిని కల్పించింది. అంటే పాకిస్థాన్ చరిత్రలో ఆయన అత్యంత శక్తివంతుడైన సైనిక పాలకుడిగా అవతరించారు. చెప్పడానికి ఇదంతా భలే ఉంది.. మరిప్పుడు ట్రంప్ పెట్టిన లిట్మస్ టెస్ట్‌లో ఎలా పాసవుతాడో చూడాలి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏకంగా 20వేల మంది పాక్ సైనికులను గాజాకి పంపడం కత్తిమీద సామే.. అందుకే పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది.
Also Read: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య.. యూనస్ ప్రభుత్వం కీలక ప్రకటన..
