ఎవరీ ఆసిఫా భుట్టో? పాకిస్థాన్ ప్రథమ మహిళ హోదా ఈమెకు ఎలా దక్కింది?

Aseefa Bhutto: భుట్టో-జర్దారీ కుటుంబంలో ఆసీఫా అంచెలంచెలుగా ఎదిగారు. అధ్యక్షుడు జర్దారీకి కొడుకు బిలావల్, కుమార్తెలు భక్తవర్, అసీఫా ఉన్నారు. 

ఎవరీ ఆసిఫా భుట్టో? పాకిస్థాన్ ప్రథమ మహిళ హోదా ఈమెకు ఎలా దక్కింది?

పాక్ అధ్యక్షుడిగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేత ఆసిఫ్‌ అలీ జర్దారీ రెండోసారి ఎన్నికయ్యారు. దీంతో పాక్ ప్రథమ పౌరుడిగా మళ్లీ ఆయనే కొనసాగుతున్నారు. అధ్యక్షుడి భార్యకు ప్రథమ మహిళ హోదా వస్తుందన్న విషయం తెలిసిందే. జర్దారీ అర్ధాంగి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు.

జర్దారీ తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. పాక్ ప్రథమ మహిళగా ఆయన తన కుమార్తె ఆసిఫా భుట్టో(31)ను గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ అధ్యక్షుడు తన కుమార్తెను ప్రథమ మహిళ పదవికి ప్రకటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

పెద్ద కుమార్తె భక్తావర్‌ భుట్టో తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేస్తూ.. న్యాయస్థానంలో విచారణలు, న్యాయపోరాటం దగ్గరి నుంచి జర్దారీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయనకు పాక్‌ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచిందని చెప్పారు. ఆసిఫా భుట్టోను ఆమె ప్రథమ మహిళగా పేర్కొంటూ పోస్ట్ చేయడం గమనార్హం.

రాజకీయాల్లో చురుకుగా
రాజకీయాల్లోకి ఆసిఫా 2020 నుంచి చురుకుగా ఉంటున్నారు. ఆత్మాహుతి దాడిలో మరణించి పాకిస్థాన్‌ తొలి మహిళా ప్రధాని బెనజీర్‌ భుట్టో కుమార్తె ఆసిఫా. భుట్టో-జర్దారీ కుటుంబంలో ఆసీఫా అంచెలంచెలుగా ఎదిగారు. అధ్యక్షుడు జర్దారీకి కొడుకు బిలావల్, కుమార్తెలు భక్తవర్, అసీఫా ఉన్నారు. ఆసీఫా రాజకీయాల వైపు మొగ్గు చూపింది.

పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా కొంతకాలం ఆసిఫా సోదరుడు బిలావల్ పనిచేశారు. అతడి కంటే తన సోదరి భక్తవర్ కంటే ఆసిఫా భుట్టో తన తండ్రితో ఎక్కువగా కనపడతారు. రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలలో చురుకుగా పాల్గొన్నారు, పీపీపీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.

పాకిస్థాన్‌లో పోలియో నిర్మూలన అంబాసిడర్‌గానూ ఆసిఫా ఉన్నారు. 2022లో ఖనేవాల్‌లో పీపీపీ ఊరేగింపు సందర్భంగా ఆసిఫా తన సోదరుడు బిలావల్‌తో కలిసి వెళుతుండగా మీడియా డ్రోన్ ఢీకొట్టింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే చికిత్స తీసుకుని కోలుకున్నారు.

Also Read: జనసేన గూటికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. భీమవరం నుంచి బరిలోకి..!