పాకిస్థాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ అరెస్ట్..?

పాకిస్థాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ అరెస్ట్..?

Updated On : May 9, 2025 / 3:24 AM IST

పాకిస్థాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. భారత్ తో ఉద్రిక్తతలు…. పాకిస్థాన్ లో నష్టానికి అసిమ్ మునీర్ వైఖరే కారణమనే అభిప్రాయంతో అతడిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. అసిమ్ మునీర్ స్థానంలో కొత్త ఆర్మీ జనరల్ గా షాహిర్ షంషద్ మీర్జాను ఎంపిక చేసినట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అరెస్ట్ చేసిన మునీర్ ను గుర్తు తెలియని ప్రాంతంలో కస్టడీలో ఉంచినట్టు తెలిసింది. అతడిని మిలటరీ కోర్టులో హాజరుపరచనున్నట్టు సమాచారం.

మొదటి నుంచి పాక్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. స్వదేశంలోనే మునీర్ మీద జనం తిరగబడ్డారు. పాక్ ఆర్మీ చీఫ్ మీద స్థానిక మతపెద్దలు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. మునీర్ కేవలం ఈగోకి వెళ్లి భారత్ కయ్యం తెచ్చుకుంటున్నాడని.. ప్రస్తుతం పాక్ ఉన్న పరిస్థితుల్లో యుద్ధం వస్తే ఆర్థికంగా మరింత చితికిపోతామని తెలిసినా కూడా జస్ట్ తన ఈగోని సంతృప్తి పరచడం కోసం అతడు కయ్యానికి కాలు దువ్వినట్టు భావిస్తున్నారు.

అసలు కాశ్మీర్ మీద అసిమ్ మునీర్ చేసిన కామెంట్స్ ప్రధానంగా ఉగ్రవాదులకు ఊతం ఇచ్చాయి అని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఏప్రిల్లో విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీలతో ఓ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మునీర్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాటం చేశారని అన్నారు. దేశంతో వారి బంధం బలహీనపడకుండా ఉండేందుకు పిల్లలకు పాకిస్థాన్ చరిత్రను తెలియజేయాలన్నారు. హిందువులతో పోలిస్తే.. తాము భిన్నమైన వారని.. తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు అన్ని భిన్నంగా ఉంటాయని తెలిపారు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని అసిమ్ మునీర్ అన్నారు. అంతటితో ఆగకుండా పాకిస్థాన్ తమకు జీవనాడి లాంటిదని.. అక్కడున్న తమ బ్రదర్స్ ను వదులుకోబోమని ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు.

మరో వైపు ఇస్లామాబాదులో పాకిస్థాన్ ప్రధాని నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

ఇక పాక్ దాడుల్లో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూలో ఎయిర్ పోర్టు మూసేశారు. జమ్మూకాశ్మీర్ లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇండియా గేట్ సహా అన్ని ప్రాంతాలను పోలీసులు మూసేశారు. పాక్ తో సరిహద్దు రాష్ట్రాల డీజీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. అలాగే సరిహద్దులోని సైనిక అధికారులతో మాట్లాడారు.