ఇదేం చట్టంరాబాబూ : ఉద్యోగాల్లో మహిళా బాస్‌లు ఎక్కువై పోయారని జరిమానా..

Paris City Hall Fined €90K For Hiring Too Many Women In Top Positions : మహిళలు తమ ప్రతిభా పాటవాలతో ఉన్నతస్థాయిలకు వెళితే ఈ పురుషాధిక్య సమాజం భరించలేదు..సహించలేదు. ఇది అభాండం కాదు..ఆరోపణ అంతకంటే కాదు. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో మహిళా బాసులు ఎక్కువపోయారంటూ..సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామకాల్లో పురుషులకు అన్యాయం జరిగిపోయిందంటూ భారీ జరిమానా వేసిన ఘటన గురించి తెలిస్తే ఎవరైనా అలాగే అంటారు.

పైగా మహిళలు ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉండటం చట్ట ఉల్లంఘటనకూడానట. మగవారికి దక్కాల్సిన అవకాశాలను మహిళలు పొందారంటూ జరిమానా వేసిన ఘటన ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగింది. పాశ్చాత్యదేశాలని చెప్పుకునే యూరప్ ఖండంలోని ఫ్రాన్స్ లో మహిళలపై ఇటువంటి చర్యలకు పాల్పడటం గమనించాల్సిన విషయం.

వివరాల్లోకి వెళితే..పురుషులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని..చట్టం ఉల్లంఘనకు గురైందని, మగవారికి దక్కాల్సిన అవకాశాలను కూడా మహిళలే పొందారంటూ ఫ్రాన్స్ ప్రభుత్వం పారిస్‌ సిటీ హాల్‌కు 90,000 యూరోలు ఇది భారత కరెన్సీలో సుమారు రూ.80 లక్షల జరిమానా విధించింది.

సివిల్ సర్వీసెస్ సీనియర్ అధికారుల్లో 2018లో ఎక్కువ మంది మహిళలు టాప్ ప్లేస్‌ల్లో ఉన్నారని భావించి పారిస్ సిటీ హాల్ కు గత మంగళవారం (డిసెంబర్15,2020) ఈ ఫైన్ వేసింది. ఇది చట్ట ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. కానీ.. ఈ జరిమానా విధించడాన్ని పారిస్ మేయర్ అన్నే హిడాల్గో తప్పుపట్టారు. నగర కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళల విషయంలో ఇటువంటి చర్యలు అసంబద్ధమని..అన్యాయమని తీవ్రంగా ఖండించారు.

2013 సంవత్సరంలో అక్కడి ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. సివిల్ సర్వీసెస్ సీనియర్ అధికారుల్లో కనీసం 40 శాతం మంది మహిళలు ముఖ్యమైన స్థానాల్లో నియమించాలనేది ఆ చట్టం ఉద్దేశం. ఈ చట్టం తీసుకొచ్చిన అనంతరం మహిళలు అత్యంత కీలక స్థానాల్లో అత్యంత సమర్థవంతంగాద బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

2018 నుంచి ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో చట్టానికి కొన్ని మార్పులు చేస్తూ వచ్చారు. పురుషులకు కూడా ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. 2018 సంవత్సరం వచ్చే సరికి 2018లో 11 మంది మహిళలు, కేవలం ఐదుగురు పురుషులు (30 శాతం) ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. పారిస్ సిటీ హాల్లో 47 శాతం మంది సివిల్ సర్వెంట్లు మహిళలు కీలక పదవులు నిర్వర్తిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం నగర పాలనా అధికారంలో కీలక పదవుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారనీ..పురుషుల అవకాశాలను కూడా మహిళే పొందుతున్నారంటూ ప్రభుత్వం పారిస్ సిటీ హాల్ కు జరిమానా విధించింది.

దీన్ని నగర్ మేయర్ హిడాల్గో తీవ్రంగా ఖండిస్తూ..మహిళాశక్తి ప్రోత్సహించటంలో మేం ముందుంటామని..తమ ప్రతిభతో ఈ స్థాయికి వచ్చిన మహిళల్ని పోత్సహించాల్సిన అవసరం ఉందని దానికి మేం కట్టుబడి ఉంటామని హిడాల్గో స్పష్టంచేశారు.