యుక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న జెలెన్ స్కీ
1991లో సోవియట్ నుంచి విడిపోయి యుక్రెయిన్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

Modi Zelensky Meet : యుక్రెయిన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. మోదీకి స్వాగతం పలికిన జెలెన్ స్కీ.. ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ఏ పక్షం వహించదని, కేవలం శాంతికి మాత్రమే వారధిగా పని చేస్తుందని సందేశమిచ్చేందుకు ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టారు. 1991లో సోవియట్ నుంచి విడిపోయి యుక్రెయిన్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.
ఆరు వారాల క్రితం ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీ హగ్ చేసుకుని ఆలింగనం చేసుకున్నారు. మోదీ రష్యా పర్యటనపై యుక్రెయిన్ విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రధాని మోదీ యుక్రెయిన్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ కు రష్యా, యుక్రెయిన్ రెండూ సమానమే అన్న సందేశాన్ని పంపగలిగారు మోదీ.
దాడులు, ప్రతి దాడులు, ఆక్రమణలతో యుక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు పెద్దన్న హోదా దేశాలు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ.. భారత ప్రధాని మోదీ.. ఈ చిక్కుముడి విప్పేందుకు అడుగులు వేస్తున్నారు. రష్యా టూర్‌తో అగ్ర దేశాల చూపు తిప్పుకున్న భారత ప్రధాని.. ఇప్పుడు యుక్రెయిన్ పర్యటనతో మరోసారి వరల్డ్ వైడ్ సరికొత్త చర్చకు తెరలేపారు.
ఘర్షణతో ఒరిగేది ఏమీ ఉండదు, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు. చర్చలతో ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఇలా అటు రష్యాకు, ఇటు యుక్రెయిన్‌కు రెండున్నరేళ్లుగా చెబుతున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండియానే. ప్రధాని మోదీ రష్యా-యుక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి ఆ దేశాల మధ్య సఖ్యతనే కోరుకుంటున్నారు.
Also Read : భారత ప్రధాని యుక్రెయిన్ టూర్.. నరేంద్ర మోదీ శాంతి మంత్రం ఫలించేనా..?