ఆల్ ఖైదా అగ్రనేతను అంతం చేశాం: అమెరికా ప్రకటన

  • Publish Date - February 7, 2020 / 04:59 AM IST

ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రతి ఉగ్రవాదిని ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తున్న అమెరికా మరో ఉగ్రవాదిని అంతం చేసింది. అరేబియా ద్వీపకల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకున్న అల్‌ఖైదా అగ్రనేతల్లో ఒకరైన ఖాసీం అల్‌-రేమీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అల్ ఖైదా గ్లోబల్ లీడర్ అమాన్ అల్-జవహరీకి డిప్యూటీగా ఉన్న అల్ ఖైదా యెమెన్ శాఖ నాయకుడు ఖాసీం అల్‌-రేమీ.

అమెరికాలో నావికా స్థావరంపై జరిగిన కాల్పులకు తామే కారణమని అంగీకరించిన కొన్ని రోజులకే అతనిని అమెరికా అంతం చేసింది. ‘‘యెమెన్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జరిగిన కాల్పుల్లో అరేబియన్‌ పెనిన్సులాలో అల్‌ఖైదా(ఏక్యూఏపీ) వ్యవస్థాపకుడు ఖాసీం అల్‌-రేమీని హతమార్చాం. రైమీ నేతృత్వంలో సామాన్య పౌరులపై ఆల్ ఖైదా అనేక దాడులకు తెగబడింది. అతను చనిపోవడంతో అల్‌ఖైదా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ మేరకు అమెరికా వైట్ హౌస్ ప్రకటర చేసింది. ట్రంప్‌ విడుదల చేసిన ప్రకటనలో అతనిని ఎప్పుడు మట్టుబెట్టాం అనేది మాత్రం వెల్లడించలేదు.

అయితే యెమెన్ మారిబ్ ప్రావిన్స్‌లో జనవరి 25వ తేదీన యుఎస్ డ్రోన్ దాడి జరిగిందని స్థానిక మీడియా చెబుతుంది. డిసెంబరు 6న ఫ్లోరిడాలోని అమెరికా నావికాదళానికి చెందిన పెన్సకోలా వైమానిక స్థావరంలో భారీ ఎత్తున ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సౌదీ అరేబియాకు చెందిన ఓ సైనికాధికారి మృతిచెందగా.. అతనితో పాటు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, దాడికి పాల్పడ్డ ముష్కరుడిని అమెరికా వెంటనే మట్టుబెట్టింది. ఈ దాడికి కారణం మేమే అంటూ ఏక్యూఏపీ ప్రకటన విడుదల చేసింది.