Ramayana In Pakistan: పాకిస్థాన్‌లో రామాయణం.. రాముడు, సీత, లక్ష్మణుడు అంతా పాక్ పౌరులే.. నాటక బృందంపై ప్రశంసల వర్షం..
రామాయణ నాటకాన్ని ప్రదర్శించినందుకు తమకు ఎలాంటి విమర్శలు కానీ బెదిరింపులు రాలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా తెలిపారు.

Ramayana In Pakistan: పాకిస్థాన్ అనేగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగ్రవాదులే. ఆ దేశం టెర్రరిస్టులకు నిలయం. అక్కడ అనేకమంది ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. ఎన్నో ఉగ్రవాద శిబిరాలు పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్నాయి. వారంతా భారత్ పై ఉగ్రదాడులు చేయడంలో నిత్యం నిమగ్నమై ఉంటారు. ఇక మత కల్లోలాలకు కూడా కేరాఫ్ పాకిస్థాన్. అలాంటి దేశంలో భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన ఇతిహాసమైన రామాయణ గాథను నాటకంగా ప్రదర్శించారు. నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం.
కరాచీ నగరంలో ఒక నాటక బృందం రామాయణ గాధను ప్రదర్శించింది. మరో విశేషం ఏంటంటే.. ఈ నాటకంలోని కళాకారుల అంతా కూడా పాకిస్థానీయులే. అంతేకాదు, ఈ నాటక ప్రదర్శనకు స్థానికుల నుంచి ప్రశంసలు కూడా లభించడం హైలైట్. ఈ నాటక ప్రదర్శనకు అక్కడ అద్భుతమైన ఆదరణ వచ్చింది.
కరాచీకి చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాలకు నాటకాలంటే ఇష్టం. థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్న ఈ ఇద్దరూ.. కొందరితో కలిసి ‘మౌజ్’ అనే నాటక బృందాన్ని స్థాపించారు. 2024 నవంబర్‌లో ఓ ఆర్ట్ గ్యాలరీలో తొలిసారిగా రామాయణ నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి అపూర్వ స్పందన వచ్చింది. ఇది వారిలో ఎంతో ఉత్సాహం నింపింది. వారు మరో అడుగు ముందుకేశారు. మరిన్ని హంగులు జోడించి, ఏఐ టెక్నాలజీని కూడా కాస్త ఉపయోగించి తాజాగా మూడు రోజుల పాటు నాటకాన్ని కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్‌లో మరోసారి ప్రదర్శించారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది.
రామాయణ నాటకాన్ని ప్రదర్శించినందుకు తమకు ఎలాంటి విమర్శలు కానీ బెదిరింపులు రాలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా తెలిపారు. ఈ పురాణ గాథకు విశేష ఆదరణ దక్కిందన్నారు. రామాయణాన్ని దృశ్యకావ్యంగా మలిచడం, స్థానికుల నుంచి మద్దతు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ నాటకానికి ఆదరణతో పాటు నటీనటుల కృషికి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
”ఈ పురాణ కథను ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనతో ఈ నాటకం ప్రదర్శించాం” అని సీత పాత్రలో నటించిన రాణా కజ్మా అన్నారు. ‘కథ చెప్పడంలో నిజాయితీ, లైటింగ్, లైవ్ మ్యూజిక్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, అబ్బురపరిచే డిజైన్లు.. ఇవన్నీ ఈ ప్రదర్శనను మరింత గొప్పగా చేశాయి’ అని చిత్ర విమర్శకుడు ఒమియర్ అలావీ అన్నారు.
మొత్తంగా పాకిస్థాన్ లాంటి దేశంలో భారతీయ ఇతిహాసం రామాయణాన్ని నాటక రూపంలో ప్రదర్శించడం సాహసోపేతమైన ప్రయత్నంగానే చెప్పాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. అక్కడ ఈ నాటకానికి అపూర్వ స్పందన లభించడం ఎంతో ఆనందం కలిగించే విషయం అంటున్నారు.