Rare Earths: చైనా దెబ్బకు అమెరికా గిలగిలా.. భారతదేశం మద్దతు కోరుతున్న ట్రంప్ టీమ్.. సమిష్టిగా పోరాడేందుకు పిలుపు..
Rare Earths China vs US : అరుదైన ఖనిజాలపై చైనా అధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ మద్దతు..

Rare Earths
Rare Earths China vs US : చైనా కొట్టిన దెబ్బకు అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. బీజింగ్ అరుదైన ఖనిజ ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశం చర్యలపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ దేశ ఉత్పత్తులపై 100శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్‌లు నవంబర్ నెల నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. అయితే, అమెరికా బెదిరింపులను చైనా పట్టించుకోకపోవడంతో భారత్‌సహా పలు దేశాల సహకారంతో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని అమెరికా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 9వ తేదీన చైనా కొత్త నిబంధన ప్రకారం.. అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్) ఎగుమతులపై నియంత్రణలు విధించింది. ప్రపంచంలో రేర్ ఎర్త్ మాగ్రైట్ (భూమి నుంచి లభించే అరుదై ఖనిజాలు) ఉత్పత్తిలో చైనా సుమారు 70శాతం నియంత్రణ కలిగి ఉంది. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, హై-టెక్ పరిశ్రమలకు కీలక ఇన్‌పుట్‌లుగా ఉన్నాయి. ఇవిలేకుంటే ఆటో మొబైల్, వాహన మోటార్, రక్షణ రంగాల కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.
ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయడంపై చైనా నియంత్రణలు విధించడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యాడు. ఆ దేశం ఉత్పత్తులపై 100శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ చిప్‌లు, లేజర్లు, జెట్ ఇంజిన్లు, ఇతర టెక్నాలజీల్లో వినియోగించే మ్యాగ్నెట్లు, ఇతర ఖనిజాలను నియంత్రించడం ద్వారా ప్రపంచాన్ని గుప్పిట పట్టాలని చైనా చూస్తోందని ట్రంప్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. చైనా తీసుకున్న నిర్ణయం ఒక్క అమెరికాకే ఇబ్బంది కాదని.. ప్రపంచంలోని అనేక దేశాలకు చైనా చర్యలు ఇబ్బంది కరమని అమెరికా పేర్కొంది. దీంతో ఈ సమస్య చైనా వర్సెస్ ప్రపంచంగా అభివర్ణిస్తున్నారు.
ట్రంప్ 100శాతం టారిఫ్‌లపై చైనా స్పందించింది. అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్) ఎగుమతులపై విధించిన నియంత్రణల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. ట్రంప్ టారిఫ్ ల నిర్ణయానికి భయపడబోమని.. ప్రపంచ శాంతి కోసమే తాము అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు విధించామని చైనా పేర్కొంది.
అరుదైన ఖనిజాలపై చైనా అధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోందని అన్నారు. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకానమీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని కోరుతున్నామని, ఆ మేరకు ఆ దేశాలు ముందుకొస్తాయని భావిస్తున్నామని పేర్కొన్నారు.
అమెరికా అరుదైన ఖనిజ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది. ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, టారిఫ్‌లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే, చైనాపై పోరులో మద్దతు కోరడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.