గాజా సిటీని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం.. ఇక ఏం జరగబోతుంది?
పత్రికా ప్రతినిధులతో మాట్లాడిన నెతన్యాహు, యుద్ధం ముగిసిన తర్వాత గాజా భద్రత తమ అధీనంలోనే ఉండాలని ఇజ్రాయెల్ కోరుకుంటుందని చెప్పారు.

PC:ANI
గాజా నగరంపై నియంత్రణ సాధించే విధంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం సీఎన్‌ఎన్ తెలిపింది. ఈ ప్రణాళిక ప్రకారం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు సన్నద్ధమవుతుంది.
ప్రారంభంలో, క్యాబినెట్‌లోని కొంతమంది మంత్రులు ఈ ప్రణాళికపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇది హమాస్‌ను ఓడించడంలో విఫలమవుతుందని, అలాగే బందీలను తిరిగి తీసుకురావడంలోనూ సమస్యలు ఎదురవుతాయని వారు ఆందోళన చెందారు. అయితే, గురువారం నెతన్యాహు గాజాను శాశ్వతంగా ఆక్రమించుకోవాలనే ఉద్దేశం మాత్రం తమకు లేదని స్పష్టం చేశారు.
తమ ప్రధాన లక్ష్యం హమాస్‌ను అంతం చేయడం, బందీలను తిరిగి సురక్షితంగా తీసుకురావడం అని పేర్కొన్నారు. ఆ తర్వాత గాజాను ఒక “తాత్కాలిక పరిపాలనా శక్తికి” అప్పగిస్తామని తెలిపారు.
పత్రికా ప్రతినిధులతో మాట్లాడిన నెతన్యాహు, యుద్ధం ముగిసిన తర్వాత గాజా భద్రత తమ అధీనంలోనే ఉండాలని ఇజ్రాయెల్ కోరుకుంటుందని నొక్కి చెప్పారు. “మేము గాజాను ఆక్రమించుకోవాలని చూడటం లేదు. కేవలం భద్రతా పరిధిని నిర్వహించాలనుకుంటున్నాం, పాలక సంస్థగా ఉండాలనేది లేదు” అని ఆయన పునరుద్ఘాటించారు. పాలస్తీనియన్ అథారిటీకి గానీ, హమాస్‌కు గానీ యుద్ధానంతరం గాజా పరిపాలనలో ఎటువంటి పాత్ర ఉండదని తేల్చి చెప్పారు.
మానవతా సాయం, యుద్ధ విరమణకు షరతులు
గాజాకు ఇజ్రాయెల్ తరలించిన మానవతా సాయం గురించి నెతన్యాహు ప్రస్తావించారు. “మేము రెండు మిలియన్ల టన్నులకు పైగా ఆహారాన్ని గాజాకు పంపాం, కానీ ఆ సరఫరాలను అడ్డుకున్నారు” అని ఆయన అన్నారు. హమాస్ ఆయుధాలు విడిచిపెట్టి, బందీలను విడుదల చేస్తే యుద్ధం తక్షణమే ముగుస్తుందని ఆయన సూచించారు. గాజాలోని చాలామంది పాలస్తీనియన్లు కూడా హమాస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్ పాలనపై ప్రణాళికలు
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడారు. హమాస్ ను అంతమొందించాక గాజా పరిపాలన కోసం ఒక ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. “మేము గాజాను మా నియంత్రణలో ఉంచుకోవాలనుకోవడం లేదు. పాలక సంస్థగా ఉండాలన్న ప్రణాళిక లేదు” అని ఆయన అన్నారు. గాజాను శాంతియుతంగా పాలించి, ఇజ్రాయెల్‌కు ముప్పు లేకుండా చూసే “నిర్దిష్ట అరబ్ పరిపాలన శక్తికి” అప్పగిస్తామని, ఇది గాజా ప్రజలకు మంచి జీవితాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు.