రష్యా వాక్సిన్ క్రేజ్…20 దేశాల నుంచి 100కోట్ల‌ డోసుల ప్రీఆర్డర్‌‌

  • Published By: venkaiahnaidu ,Published On : August 11, 2020 / 08:56 PM IST
రష్యా వాక్సిన్ క్రేజ్…20 దేశాల నుంచి 100కోట్ల‌ డోసుల ప్రీఆర్డర్‌‌

Updated On : August 12, 2020 / 11:39 AM IST

కరోనా వైరస్‌ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఇవాళ(ఆగస్టు-11,2020)ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నిరోధించే వ్యాధి నిరోధకతను కలిగిఉందని వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను మంగళవారం ఉదయం రష్యా నమోదు చేసిందని మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్‌ వెల్లడించారు. కొద్దివారాల్లోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఉత్పత్తిని చేపట్టి లక్షలాది డోసులను సరఫరా చేస్తామని తెలిపారు.

తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి వ్యాక్సిన్‌ వేయించినట్టు పుతిన్ ప్రకటించారు. వ్యాక్సిన్‌ అందించిన తర్వాత ఆమెలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు దీటుగా పెరిగాయని చెప్పారు. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ చేపడతామని తెలిపారు. రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

రష్యా తీసుకొస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు పేరును కూడా ఖరారు చేసింది. ‘స్పుత్నిక్ వీ’ పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసిన్‌ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ వెల్లడించారు

స్పుత్నిక్ వీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. బుధవారం నుంచి ఫేస్ 3 ట్రయల్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. కాగా, ప్రపంచంలోని 20 దేశాలు ఇప్పటికే బిలియన్ డోసుల కంటే ఎక్కువగా ప్రి ఆర్డర్ చేశాయని కిరిల్ వివరించారు.

కాగా, రష్యా దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో యూఎస్ఏ, బ్రెజిల్, ఇండియాల తర్వాత రష్యా కొనసాగుతోంది.అయితే, కట్టడి సమర్థవంతంగా చేయడంతో ఇటీవల కాలంలో రష్యాలో ఎక్కువ కేసులు నమోదు కావడం లేదు.