Russia Ukraine: శవాలను పూడ్చేందుకూ వీల్లేకుండా యుక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా
యుద్ధం కారణంగా మృతి చెందిన వారి శవాలను పూడ్చేందుకు కూడా సమయం ఇవ్వకుండా రష్యా సైన్యం దాడులకు తెగబడుతుంది.

Ukriane
Russia Ukraine: యుక్రెయిన్ పై రష్యా యుద్ధం మరింత భీకరంగా సాగుతుంది. కనీసం యుద్ధం కారణంగా మృతి చెందిన వారి శవాలను పూడ్చేందుకు కూడా సమయం ఇవ్వకుండా రష్యా సైన్యం దాడులకు తెగబడుతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆదివారానికి 18వ రోజుకి చేరుకుంది. రష్యా సైన్యం చేస్తున్న భీకర దాడులతో యుక్రెయిన్ దేశం అల్లాడిపోతోంది. ప్రపంచ దేశాల ఆంక్షలు, వాణిజ్య పరమైన ఇబ్బందులు వచ్చినా లెక్క చేయని రష్యా.. యుక్రెయిన్ పై పట్టుకోసం బాంబులు, రాకెట్ దాడులతో నగరాలను ధ్వంసం చేస్తుంది. రష్యా సృష్టించిన విధ్వంసంతో యుక్రెయిన్ లో ఎటు చూసిన ధ్వంసమైన భవనాలు, శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. కడుపు తరుక్కుపోతున్న దృశ్యాలను చూస్తూ యుక్రెయిన్ ప్రజలు జీవచ్చవాలుగా బతుకుతున్నారు.
Also read: Saudi Arabia: ఒకే రోజు 81 మందికి మరణశిక్ష విధించిన సౌదీఅరేబియా
రష్యా సైన్యం దాడుల్లో ఇప్పటి వరకు 1300 మంది యుక్రెయిన్ సైనికులు మృతి చెందినట్లు జెలెన్స్కీ ప్రకటించాడు. రష్యా సైనిక చర్యలో యుక్రెయిన్‌లో 579 మంది పౌరులు మృతి,వెయ్యిమందికి పైగా గాయపడ్డారని ఐరాస మానవ హక్కుల హైకమిషన్ వెల్లడించింది. మృతుల్లో 42 మంది చిన్నారులు కూడా ఉన్నారు. రష్యా బలగాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ తెలిపాడు. కీవ్‌తోపాటు యుక్రెయిన్ లోని ఇతర నగరాల్లోనూ ఇరుదేశాల సైనికుల మధ్య భీకర యుద్ధం జరుగుతున్నట్టు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపాడు. యుక్రెయిన్ ను మరింత లొంగదీసుకునేందుకు..రష్యా పదాతిదళాలు కీవ్‌కు 15కిమీ సమీపానికి చేరుకున్నాయి. దాడుల నేపథ్యంలో మానవతా మార్గాల ద్వారా ప్రజల తరలింపు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. మరియుపోల్ నగరంలో భీకర దాడుల కారణంగా పౌరుల తరలింపుకు ఆటంకం ఏర్పడింది. పౌరుల తరలింపుపై గతంలో ఇరు దేశాలు ఒప్పందం ప్రకారం కొంత విరామ సమయం కేటాయించుకున్నా..రష్యా సైనికులు ఆ ఒప్పందాన్ని తుంగలోతొక్కారు. మరీ దారుణంగా మానవతా మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న అమాయక పౌరులను, చిన్నారులను సైతం రష్యన్ బలగాలు వెంటాడి హతమార్చుతున్నట్టు యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
Also read: Russia Ukraine War: రష్యా సైనికులను తికమకపెడుతున్న యుక్రెయిన్ పౌరులు
మెలిటొపోల్ నగర మేయర్‌ను రష్యా బలగాలు అపహరించుకుపోయినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. “రష్యా ఉగ్రవాదం” కొత్త దశలోకి మారిందని..చంటి పిల్లలను సైతం పొట్టనబెట్టుకుంటూ.. రష్యా సేనల క్రూరత్వానికి అడ్డుఅదుపులేకుండా పోయిందంటూ యుక్రెయిన్ నిఘావర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. చెచెన్యా, సిరియా ఉగ్రవాద మూకలపై రష్యా అనుసరించిన “నింగి నేలా” దాడుల వ్యవహాన్ని యుక్రెయిన్ లోనూ అనుసరిస్తూ.. నగరాలకు నగరాలను నాశనం చేస్తుంది రష్యా. రష్యా దాడులతో యుక్రెయిన్ లోని పలు నగరాలూ పూర్తిగా స్వరూపాన్ని కోల్పోయాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. యుక్రెయిన్ నుంచి 25 లక్షల మంది పౌరులు ఇతరప్రాంతాలకు వలస వెళ్లినట్లు ఐరాస పేర్కొంది.
Also read: Congo Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 60 మందికి పైగా మృతి!
యుక్రెయిన్ పై దాడులు ఆపాలంటూ జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఫోన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడినట్లు తెలుస్తుంది. యుద్ధాన్ని తక్షణం విరమించాలని పుతిన్ ను కోరారు ఆయాదేశాల నేతలు. మరోవైపు రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆకాంక్షించారు. పుతిన్ తో జెరూసలెంలో సమావేశమయ్యేందుకు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్‌ను కోరాడు జెలెన్స్కీ. ఇజ్రాయెల్ ప్రధాని ఇటీవల రష్యాలో పర్యటించారు. ఇజ్రాయెల్ కు అటు రష్యాతోనూ ఇటు యుక్రెయిన్ తోనూ సత్సంబంధాలు ఉన్నాయి.