Chandrayaan-3 vs Luna-25: లూనా-25 ల్యాండర్‌లో సాంకేతిక సమస్యలు.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలి అడుగు మనదేనా?

రష్యా అంతరిక్ష సంస్థ చంద్రుడి ఉపరితలంపైకి ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దాని ల్యాండింగ్ తేదీలో మార్పు జరిగే అవకాశం ఉంది.

Chandrayaan-3 vs Luna-25:  లూనా-25 ల్యాండర్‌లో సాంకేతిక సమస్యలు.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలి అడుగు మనదేనా?

Russia Luna-25

Updated On : August 20, 2023 / 11:47 AM IST

Russia Luna25: ఒకవైపు భారత్, ఒకవైపు రష్యా చంద్రుడి ఉపరితలం దక్షిణ ధ్రువంపై తొలిసారి కాలుమోపేందుకు తమతమ రాకెట్లను ప్రయోగించాయి. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జూలై 14న చంద్రయాన్-3ని చంద్రుడిపైకి పంపించింది. ఆ తరువాత రష్యా అంతరిక్ష సంస్థ లూనా-25ను ఈనెల 11న రష్యాలోని వోస్తాక్నీ కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. చంద్రయాన్-3 ముందుగా చంద్రుడిపైకి దూసుకెళ్లినప్పటికీ ఈనెల 23న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రదేశంలో ల్యాండ్ కానుంది. లూనా -25కూడా అదే ప్రాంతంలోని బొగుస్లావ్‌స్కీ బిలానికి చేరువలో ఈనెల 21, 22 తేదీల్లో ల్యాండ్ కావాల్సి ఉంది. అదే జరిగితే చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై తొలిసారి కాలుమోపిన ఘనతను రష్యా అంతరిక్ష సంస్థ సొంతం చేసుకుంటుంది. రష్యా అంతరిక్ష సంస్థ వివరాల ప్రకారం.. లూనా-25 తొలిసారి చంద్రుడి ఉపరితలం దక్షిణ ధ్రువంపై కాలుమోపుతుందని అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

Outer Ring Road: ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. నేటి నుంచే అమలు

జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌లో తాజాగా ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం ఆ వ్యోమనౌక చందమామ కక్ష్యలతో పరిభ్రమిస్తోంది. లాండింగ్‌కు ముందు కక్ష్య (ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్) కు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఈ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ తెలిపింది. నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్‌కాస్మోస్ తెలిపింది. ఈ నేపథ్యంలో లూనా-25 ల్యాండింగ్ వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంపై రాస్‌కాస్మోస్ స్పష్టత ఇవ్వలేదు. చంద్రయాన్-3 కంటే ముందుగానే చంద్రుని ఉపరితలం దక్షిణ ధ్రువంపై కాలుమోపేందుకు ప్రయత్నాలను రష్యా అంతరిక్ష సంస్థ కొనసాగిస్తోంది.

Chandrayaan-3: ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత తొలిసారి.. చంద్రుడి ఫొటోలు పంపిన ల్యాండర్ విక్రమ్

చంద్రుడి ఉపరితలంపై దక్షిణ భాగంలో అడుగు పెట్టేలా ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్-3 ఒక్కో కక్ష్యను దాటుకుంటూ ఇస్రో అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తోంది. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రక్రియ పూర్తికావడంతో ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ సొంతంగా తిరగడం ప్రారంభించింది. ఆదివారం (ఆగస్టు 20) తెల్లవారుజామున చంద్రయాన్-3 మరో కీలక ఘట్టం పూర్తిచేసింది. తెల్లవారుజాము 2గంటల నుండి 3 గంటల మధ్య రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవతంగా పూర్తిచేసింది. ఇస్రో ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25కిలో మీటర్లు, అత్యధికంగా 134 కిలో మీటర్లు దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కీలక ఘట్టం పూర్తికావడంతో ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ భాగంలో దిగడమే తరువాయిఅని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Chandrayaan-3 vs Luna-25 : జాబిల్లిపైకి రష్యా ప్రయోగం వల్ల చంద్రయాన్‌-3కి ఇబ్బందులుంటాయా? శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?

అన్నీ ఇస్రో అంచనాలకు అనుగుణంగా జరిగితే ఈనెల 23న సాయంత్రం 5.45 గంటలకు చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలం దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. ఆగస్టు 21న రష్యా అంతరిక్ష సంస్థ ప్రయోగించిన లూనా-25 ల్యాండ్ కావాల్సి ఉంది. తాజాగా, లూనా-25లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ల్యాండింగ్ తేదీ మారే అవకాశం ఉంది. 23వ తేదీ తరువాతకు లూనా-25 ల్యాండింగ్ తేదీ వెళితే.. ముందుగా చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలం దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో సరికొత్త రికార్డు నమోదు చేస్తుంది.