భారత్‌లో పుతిన్ పర్యటన వేళ.. “రెలోస్” ఒప్పందానికి రష్యా పార్లమెంట్‌లో ఆమోదం.. రెలోస్ అంటే ఏంటి? ఇకపై ఏం జరగనుంది?
రెలోస్ (రిసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్) భారత్-రష్యా సైనిక లాజిస్టిక్స్ పంచుకునే ఒప్పందం.
Russia parliament: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ పర్యటన వేళ రష్యా పార్లమెంట్ భారత్‌తో కీలక సైనిక లాజిస్టిక్స్ ఒప్పందాన్ని అధికారికంగా ఆమోదించింది. రిసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (రెలోస్) ఆమోదానికి సంబంధించిన బిల్లును రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్తిన్ రష్యా డూమా (పార్లమెంట్)లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు ఆమోదముద్ర పడింది.
భారత్-రష్యా సైనిక లాజిస్టిక్స్ పంచుకునే ఒప్పందం ఇది. దీన్ని ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన సూచన అని స్పీకర్ వ్యాచిస్లావ్ వొలోడిన్ పేర్కొన్నారు. భారత్-రష్యా మధ్య ఉన్న బంధాన్ని సమగ్ర వ్యూహాత్మక సంబంధంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించడం మరొక ముందస్తు అడుగుగా అభివర్ణించారు.
డూమా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఈ ఒప్పందం ప్రకారం సైనిక విమానాలు, నౌకలు, ఇతర యూనిట్లను ఇరు దేశాలు వాడుకునే సౌకర్యం కలుగుతుంది. సంయుక్త ఎక్సర్‌సైజ్‌లు, శిక్షణ కార్యక్రమాలు, మానవతా సహాయం, విపత్తు సహాయక కార్యకలాపాలకు ఇది వర్తిస్తుంది. ఇరు దేశాల ప్రభుత్వాలు ఏ ప్రదేశంలో కార్యకలాపాలు నిర్వహించాలనుకుంటే ఆ ప్రదేశంలో ఈ ఏర్పాట్లు అమలు అవుతాయి.
పుతిన్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 23వ వార్షిక ద్వైపాక్షిక సదస్సు ఉంటుంది. రక్షణ, వాణిజ్య రంగాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఎస్-400 క్షిపణి వ్యవస్థ అంశంపై కూడా మోదీ-పుతిన్ భేటీలో చర్చించవచ్చని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. సు-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ గురించీ చర్చ జరగవచ్చని చెప్పారు. ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్దో ఐదో తరం యుద్ధవిమానం.
రెలోస్ అంటే ఏమిటి?
- రెలోస్ (రిసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్) భారత్-రష్యా సైనిక లాజిస్టిక్స్ పంచుకునే ఒప్పందం.
- రష్యా సైనిక విమానాలు, నౌకలు, సిబ్బంది భారత బేస్‌లు, వసతులు ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా భారత దళాలు రష్యా వసతులను వాడుకోవచ్చు.
- సంయుక్త ఎక్సర్‌సైజ్‌లు, శిక్షణ మిషన్లు, మానవతా సేవ, విపత్తు సహాయం వంటి కార్యకలాపాలకు లాజిస్టిక్స్ సపోర్టు ఉంటుంది.
- ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. భారత్-రష్యా ఏ ప్రదేశంలో సంయుక్త కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయిస్తే అక్కడ అవి జరుగుతాయి.
- సంయుక్త కార్యకలాపాలు, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం వేగంగా జరిగేలా సైనిక అనుసంధానం బలోపేతం అవుతుంది.
