Canada Army
Russia Ukraine Tension : రష్యా-యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుక్రెయిన్ సరిహద్దుల్లోకి రష్యా తన బలగాలు తరలించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. కాగా, రష్యాకు వ్యతిరేకంగా, యుక్రెయిన్‌కు మద్దతుగా కొన్ని దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లు రష్యాకు వ్యతిరేకంగా ముందుకు సాగుతూ ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా కెనడా కూడా రంగంలోకి దిగింది. రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది.
అంతేకాదు, తూర్పు యూరప్ ప్రాంతంలోకి నాటో బలగాలకు దన్నుగా వందలాది సైనిక బలగాలను పంపిస్తున్నట్టు వెల్లడించింది. లాత్వియా సహా పరిసర ప్రాంతాల్లోకి 460 మంది సభ్యులతో కూడిన సాయుధ బలగాలను పంపుతున్నట్టు కెనడా ప్రధాని ట్రూడో తెలిపారు. రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేసేందుకు మిత్ర దేశాలతో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే.. భారత్‌లో ఏయే వస్తువుల ధరలు పెరగొచ్చుంటే?
యుక్రెయిన్‌లోకి రష్యా బలగాలను తరలిస్తున్న వేళ.. దీనికి ప్రతిస్పందనగా తూర్పు యూరప్ ప్రాంతంలోకి వందలాది బలగాలను పంపనున్నాం. రష్యా చర్యలకు వ్యతిరేకంగా.. ఆ దేశంపై కొత్త ఆంక్షలను విధిస్తున్నాం. రష్యా దూకుడు నేపథ్యంలో నాటో దళాలను బలపరిచేందుకు లాత్వియా సహా పరిసర ప్రాంతాల్లోకి 460 మంది సభ్యులతో కూడిన సాయుధ బలగాలను పంపుతున్నాం. రష్యాను ఆర్థికంగా ఒంటరిగా చేసేందుకు కెనడా తన మిత్రదేశాలతో కలిసి పలు చర్యలు తీసుకుంటోంది” అని కెనడా ప్రధాని ట్రూడో చెప్పారు.
యుక్రెయిన్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించిన పుతిన్.. వాటిలోకి రష్యా బలగాలను పంపుతున్నట్టు ప్రకటించారు. దీనిపై ప్రపంచ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. రష్యా వైఖరిని నిరసిస్తూ ఆ దేశంపై ఆంక్షల కత్తిని ఝళిపిస్తున్నాయి. ఆ దేశాన్ని ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఏకాకిని చేసే చర్యలు ముమ్మరం చేశాయి.
Russia : యుక్రెయిన్‌పై పంజా విసురుతున్న రష్యా.. ఆర్థిక ఆంక్షలను పట్టించుకోని పుతిన్
దొనెట్స్క్, లుహాన్స్క్‌లతో తమ దేశ పౌరులు, సంస్థలు ఎలాంటి వాణిజ్య సంబంధాలు నిర్వహించకుండా అమెరికా నిషేధం విధించింది. యుక్రెయిన్‌పై రష్యా దుందుడుకు వైఖరిని మార్చుకోకుంటే మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు రష్యాకు చెందిన 5 ప్రముఖ బ్యాంకులు, ముగ్గురు సంపన్నుల కార్యకలాపాలపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. జర్మనీ కూడా రష్యాకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి సహజ వాయువు సరఫరాకు ఉద్దేశించిన ‘నార్డ్ స్ట్రీమ్ 2’ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు యూరప్ సమాఖ్య(ఈయూ)లోని 27 సభ్య దేశాలు.. రష్యా అధికారులపై ఆంక్షల అమలుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. దొనెట్స్క్, లుహాన్స్క్‌లలోకి దళాలను పంపే నిర్ణయానికి ఆమోదం తెలిపిన రష్యా దిగువ సభ సభ్యులు, అధికారులపై ఆంక్షలు విధించినట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వెస్ లె డ్రియన్ తెలిపారు.