Russia Ukraine War : రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. 9/11 దాడుల తరహాలో భవనాలపై దాడులు..!

Russia Ukraine War : రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. 9/11 దాడుల తరహాలో భవనాలపై దాడులు..!

Russia Ukraine War

Updated On : December 21, 2024 / 6:59 PM IST

Russia Ukraine War : రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రష్యాలోని ఎత్తైన భవనాలే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులకు దిగింది. రష్యా దాడులకు ప్రతిదాడిగా మాస్కోలోని కజాన్ నగరంలో ఆకాశ వీధుల్లో ఉక్రేనియన్ డ్రోన్‌లు దూసుకెళ్లాయి. ఈ దాడులను 2001లో అమెరికాలోని న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని ట్విన్ టవర్లను విమానాలు ఢీకొట్టిన 9/11 దాడితో పోలుస్తున్నారు.

గతంలో ఘోరమైన 9/11 దాడులలో హైజాక్ చేసిన విమానాలు న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్, వాషింగ్టన్‌లోని పెంటగాన్‌లపైకి దూసుకెళ్లడంతో దాదాపు 3వేల మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం, రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆయా వీడియోలలో మాస్కోకు తూర్పున 500 మైళ్ల (800 కిమీ) దూరంలో ఉన్న కజాన్‌లోని రెండు ఆకాశహర్మ్యాల్లోకి వైమానికంగా డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. ఎత్తైన భవనాలతోపాటు నివాస సముదాయాలు లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో రష్యాలోని 6 ఎత్తైన భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. డ్రోన్ల దాడులు జరిపిన ప్రదేశాల్లో నల్లటి పొగ భారీగా కమ్మేయడం వీడియోల్లో కనిపిస్తోంది.

ఈ దాడుల నేపథ్యంలో రష్యాలోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రష్యా గగనతలంలో విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. నివేదికల ప్రకారం.. భవనాల్లోని నివాసితులందరినీ సురక్షితంగా ఖాళీ చేయించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రోన్ల దాడులకు బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు.

ఈరోజు ఉదయం 7.40, ఉదయం 9.20 మధ్య మూడు డ్రోన్‌లు నగరంపై దాడి చేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 6 డ్రోన్‌లు భవనాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. ముందుజాగ్రత్తగా టార్టార్‌స్థాన్‌లోని అన్ని ప్రధాన బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

కజాన్‌కు ఈశాన్యంగా ఉన్న ఇజెవ్స్క్, కజాన్‌కు దక్షిణంగా 400 మైళ్ల (650 కి.మీ) దూరంలో ఉన్న సరాటోవ్‌లోని మరో రెండు విమానాశ్రయాల్లో కూడా తాత్కాలిక ఆంక్షలను విధించినట్టు రష్యాకు చెందిన ఏవియేషన్ వాచ్‌డాగ్ రోసావియాట్సియా తెలిపింది.

సరాటోవ్ వద్ద ఆంక్షలు తరువాత ఎత్తివేసినట్టు తెలిపింది. మరోవైపు.. ఉక్రెయిన్ మానవరహిత డ్రోన్లను చాలా కూల్చేశామని రష్యా ప్రకటించింది. నివాస ప్రాంతాల్లో జరిగిన డ్రోన్ల దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారని అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. యుద్ధాన్ని ఎలా ముగించాలనే దానిపై చర్చలకు ఇంకా ఆధారాలు లేవని రష్యా చెప్పిన వారాల తర్వాత ఉక్రెయిన్ దాడులకు దిగినట్టుగా తెలుస్తోంది.

నవవంబర్ చివరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్‌తో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. రష్యా దళాలు ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతం నియంత్రణలో ఉన్నాయి.

యుద్ధం ప్రారంభ రోజుల నుంచి అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయి. అయితే, ఉక్రెయిన్ నాటో (NATO)లో చేరాలనే తన ఆశయాన్ని విరమించుకుని, ఇప్పుడు రష్యా దళాల నియంత్రణలో ఉన్న భూభాగాల నుంచి దళాలను ఉపసంహరించుకుంటే తప్ప అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరపబోమని క్రెమ్లిన్ పదేపదే చెప్పింది.

ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఈ యుద్ధంలో పదివేల మంది మరణించారు. లక్షలాది మంది దేశం వదిలిపోయారు. 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత మాస్కో, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది.

Read Also : GST Council Meet : ‘జీఎస్టీ కౌన్సిల్’ కీలక నిర్ణయాలు.. పాత కార్ల అమ్మకాలపై 18శాతం జీఎస్టీ బాదుడు.. పాప్‌కార్న్‌పై కొత్త పన్ను రేట్లు..!