Russia Ukraine War: 500 రోజులు దాటిన రష్యా – యుక్రెయిన్ యుద్ధం.. వార్ ఆగాలంటే అదొక్కటే పరిష్కారం!

యుద్ధాన్ని వీలయినంత తొందరగానే ముగిద్దామనుకున్న రష్యా కూడా యుక్రెయిన్‌ను ముందు పెట్టి అమెరికా, పాశ్చాత్యదేశాలు వ్యవహరిస్తున్న తీరు చూసి మనసు మార్చుకుంది.

Russia Ukraine War: 500 రోజులు దాటిన రష్యా – యుక్రెయిన్ యుద్ధం.. వార్ ఆగాలంటే అదొక్కటే పరిష్కారం!

Russia Ukraine war completed 500 days

Russia Ukraine War 500 days : యుద్ధం పేరులోనే విధ్వంసం, వినాశనం దాగి ఉంటాయి. అసలు యుద్ధం మొదలే అవ్వకూడదు. ఒకవేళ ప్రారంభమైనా ఎంత త్వరగా ముగిస్తే నష్టం స్థాయి అంత తక్కువగా ఉంటుంది. ఏ కారణాలతో అయినప్పటికీ.. సుదీర్ఘంగా సాగే యుద్ధం మిగిల్చేది.. ఊహకందని విపత్తునే. ఆ ప్రభావం నుంచి బయటపడడానికి బాధిత దేశానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఆ దేశ ప్రజలను కొన్ని తరాలపాటు అంతులేని వేదన వెంటాడుతుంది. బాధిత దేశమే కాదు.. యుద్ధం ప్రకటించిన దేశమూ జాతి ప్రయోజనాలను పణంగా పెట్టాల్సిందే. అందుకే యుద్ధంలో గెలిచేదెవరూ ఉండరు. అయినా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నెత్తురు పారుతూనే ఉంది. రెండు రోజుల్లో ముగుస్తుందనుకున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం 2022ను యుద్ధనామసంవత్సరంగా మారుస్తూ ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలయింది.

యుక్రెయిన్‌పై స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభమై 500 రోజులు దాటింది. యుద్ధం ప్రారంభమయినప్పుడు ఇంత సుదీర్ఘకాలం సాగుతుందన్న అంచనా ఎవరికీ లేదు. నాలుగైదు రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందని అంతా భావించారు. యుద్ధం అసలు లక్ష్యమేంటో తెలియనప్పటికీ నెలరోజులలోపు యుక్రెయిన్‌ను రష్యా స్వాధీనం చేసుకుంటుందని అంచనా వేశారు. కానీ పరిస్థితులు తలకిందులయ్యాయి. స్పెషల్ మిలటరీ ఆపరేషన్ సుదీర్ఘయుద్ధంగా మారింది. నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ యుద్ధం ఇంకా ఎన్నాళ్లుంటుందో.. ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న ప్రజలు
నాటోకూటమిలో చేరాలన్న యుక్రెయిన్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా యుద్ధం మొదలయింది. అంతులేని యుద్ధంలో ఫలితం తేలనట్టే..యుక్రెయిన్ నాటో చేరిక వ్యవహారంలోనూ ఎలాంటి పురోగతి లేదు. కానీ యుద్ధం ఇటు యుక్రెయిన్‌కు, అటు రష్యాకు అంచనాలకందని నష్టం మాత్రం మిగిల్చింది. యుక్రెయిన్ ఎప్పుడో శిథిలావస్థకు చేరింది. పునర్‌నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. దేశం మొత్తం అస్థవ్యస్థమయింది. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఉపాధి అవకాశాలు పోయాయి. 63 లక్షల మంది వలసపోయారు. దేశంలో మిగిలిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు యుక్రెయిన్ ప్రజలకు భవిష్యత్ గురించి నమ్మకం, ఆశ లేవు. అసలు రోజు గడుస్తుందన్న భరోసానే లేదు. అంతటా అనిశ్చితి. అడుగడుగునా ప్రాణభయం. దేశం మొత్తం యుద్ధరంగమే. వీధులన్నీ రణక్షేత్రాలే. అందుకే సైనికులే కాదు.. సాధారణ ప్రజలూ చనిపోతున్నారు. మొత్తంగా యుక్రెయిన్ కోలుకోలేని స్థాయిలో దెబ్బతింది. నష్టం ఇంకా కొనసాగుతూనే ఉంది.

యుక్రెయిన్‌ను ముందు పెట్టి..
రష్యా పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీలేదు. యుక్రెయిన్‌లా మొత్తం రష్యాలో ప్రత్యక్ష విధ్వంసం జరగడం లేదు కానీ.. యుద్ధభారంతో రష్యా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. సాధారణ సైనికుల సంఖ్య సరిపోక.. సైన్యం రిక్రూట్‌మెంట్ నిత్యకృత్యంలా మారింది. సాధారణ ప్రజలు, చివరకు జైల్లోని ఖైదీలు సైతం రణరంగంలో సైనికులుగా మారిపోతున్నారు. నిజానికి ఈ యుద్ధం ఒక్క రష్యా-యుక్రెయిన్ మధ్యే అయితే.. ఇన్నాళ్లూ సాగుండేదే కాదు. రష్యా ఎప్పుడో యుక్రెయిన్‌ను ఆక్రమించి ఉండేది.. లేదా రష్యా షరతులకు ఒప్పుకుని యుక్రెయిన్ లొంగిపోయి ఉండేది. కానీ ఇప్పుడు యుద్ధం సాగుతోంది రష్యాకు, యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన పాశ్చాత్యదేశాలకు మధ్య. యుక్రెయిన్‌ను ముందు పెట్టి యుద్ధాన్ని వెనకనుంచి నడిపిస్తున్నాయి. అమెరికా, కొన్ని యూరప్ దేశాలు. యుక్రెయిన్‌కు వెన్నుదన్నుగా ఉంటూ అపార ఆయుధ సాయాన్ని, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. రష్యా ఒంటిచేత్తో.. అమెరికా, నాటోకూటమితో పోరాడుతోంది.

Also Read: 33 ఏళ్ల ప్రియురాలికి రూ. 906 కోట్లు రాసిచ్చిన ఇటలీ మాజీ ప్రధాని

నిస్సహాయ పరిస్థితిలో జెలన్‌స్కీ
యుద్ధం సుదీర్ఘంగా సాగడానికి కారణం అమెరికా, యూరప్ దేశాలే. యుక్రెయిన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా యుద్ధం చేయడం మినహా చేయగలిగిన సాయమంతా ఆయాదేశాలు చేస్తున్నాయి. ఆయుధ, ఆర్థిక సాయమే కాదు.. నైతిక, మానసిక స్థైర్యాన్నీ అందిస్తున్నాయి. అందుకే చిన్నదేశమైనప్పటికీ.. యుక్రెయిన్ 500 రోజులుగా పెద్ద దేశం రష్యాతో పోరాడుతూనే ఉంది. అంతిమంగా ఈ యుద్ధంతో పెనువినాశనం జరుగుతోంది యుక్రెయిన్‌కే అని తెలిసినప్పటికీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలన్‌స్కీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో మిగిలిపోయారు. యుద్ధం మొదలయిన రోజే అధ్యక్ష భవనం వదిలి.. నేరుగా రణరంగంలోకి దూకిన జెలన్‌స్కీ.. అప్పటినుంచి ఓ సైనికునిలా పోరాడుతూనే ఉన్నారు. అలా యుక్రెయిన్ ప్రజలతో పాటు మిగిలిన ప్రపంచానికీ ఆయన ఓ హీరోలానే కనిపిస్తున్నప్పటికీ.. అంతకుమించిన ప్రత్యమ్నాయమూ జెలన్‌స్కీ ముందు లేదు. చెప్పాలంటే ఆయన ఒక్క నిర్ణయమూ సొంతంగా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అమెరికా, పాశ్చాత్యదేశాలు చెప్పినట్టు చేయడం తప్ప.. మరేమీ చేయలేని స్థితిలోకి అనివార్యంగా వెళ్లిపోయారు.

Also Read: పాకిస్తాన్ నుంచి ట్వీట్ చేస్తే, జమ్మూ కశ్మీర్ అని చూపిస్తోందట.. వివాదాస్పదంగా ట్విటర్ తీరు

వినాశనం, విధ్వంసం..
యుద్ధాన్ని వీలయినంత తొందరగానే ముగిద్దామనుకున్న రష్యా కూడా యుక్రెయిన్‌ను ముందు పెట్టి అమెరికా, పాశ్చాత్యదేశాలు వ్యవహరిస్తున్న తీరు చూసి మనసు మార్చుకుంది. అటు రష్యాలోనూ ఇటు యుక్రెయిన్‌లోనూ ఎంత వినాశనం, విధ్వంసం జరిగినా వెనక్కి తగ్గకూడదన్న నిర్ణయానికివచ్చింది. వ్యయప్రయాసలకోర్చి సుదీర్ఘయుద్ధం కొనసాగిస్తోంది. అసలు రష్యా ముఖ్యలక్ష్యం యుక్రెయిన్‌ను నాటో కూటమిలో చేరనీకుండా అడ్డుకోవడమే. నాటో కూటమిలో యుక్రెయిన్ చేరితే అమెరికా, పాశ్చాత్యదేశాల బలగాలు సరిహద్దుల్లోకి వచ్చే అవకాశముండడం, రష్యా సార్వభౌమత్వంపై దాడి జరిగే ప్రమాదముండడం స్పెషల్ మిలటరీ ఆపరేషన్‌కు కారణమని పుతిన్ చెబుతున్నారు. యుక్రెయిన్ నాటోలో చేరకముందే అన్నివిధాలా అండగా ఉంటున్న పాశ్చాత్యదేశాల వైఖరి గమనిస్తే.. పుతిన్ ఆందోళన, ముందు చూపు తప్పు కాదన్న అభిప్రాయం కలుగుతోంది.

Also Read: సిరియాలో అమెరికా డ్రోన్ దాడి, ఇస్లామిక్ స్టేట్ నాయకుడి హతం

నిజానికి రష్యా అనుకుంటే ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని ముగించగలదు. కానీ అణ్వాయుధాలు ప్రయోగించైనా సరే యుక్రెయిన్‌ను దారికి తెచ్చుకోవాలని భావించడం వెనక భవిష్యత్తులో రష్యాకు వ్యతిరేకంగా జరిగే అవకాశమున్న కుట్రలను నివారించేందుకే. యుద్ధం ఇన్నాళ్లుగా జరుగుతున్నా ఏ దేశమూ శాంతిచర్చల గురించి మాట్లాడడం లేదు. యుద్ధం మొదలయిన కొత్తల్లో ఓ సారి, గత నెలలో మరోసారి శాంతిచర్చలకు ప్రయత్నాలు జరిగాయి తప్పితే.. వాటికోసం పట్టుపట్టి జెలన్‌స్కీని, పుతిన్‌ను ఓ వేదికపైకి తీసుకొచ్చి మాట్లాడేవారే కరవయ్యారు. అందుకే యుద్ధం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

ఇప్పుడు కనిపిస్తున్న పరిష్కారం అదొక్కటే!
500 రోజుల యుద్ధంలో ఎంతమంది చనిపోయారనేది ఏ దేశమూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ 500 మంది పిల్లలు సహా 9 వేలమంది యుక్రెయిన్ పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య 2022తో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ.. మే,జూన్‌లో మళ్లీ మృతుల సంఖ్య పెరగడం మొదలయింది. 63లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు దేశాల సైనికులు లక్షల సంఖ్యలో అమరులయ్యారు. పదహారున్నర నెలల యుద్ధంలో తూర్పు యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకోవడం కీలక పరిణామం. గత నెల చివరివారంలో జరిగిన వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు పెను సంచలనం. తాత్కాలికంగా ఆ సమస్య సద్దుమణిగిపోయినా ఇటు యుక్రెయిన్, అటు రష్యా అధ్యక్షులు, ప్రజలు యుద్ధం కారణంగా దినదినగండంగానే గడుపుతున్నారు. అంతర్జాతీయ సమాజం ఎలాగూ పట్టించుకోవడం లేదు కాబట్టి.. రష్యా యుక్రెయిన్ స్వచ్ఛందంగానే ఈ విధ్వంసానికి ఇంతటితో ముగింపు పలికి.. యుద్ధాన్ని విరమించగలగడం ఒక్కటే ఇప్పుడు కనిపిస్తున్న పరిష్కారం.