అందుకే భారత్ మానుంచి చమురు కొంటోంది: ట్రంప్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రష్యా
భారత్-అమెరికా సంబంధాలలో తాము జోక్యం చేసుకోబోమని రష్యా చెప్పింది.

Russia President Vladimir Putin
Russia: రష్యా నుంచి డిస్కౌంట్‌లో వస్తున్న చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందంటూ, దీనిపై ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లను ఇప్పటికే భారత్ ఖండించింది. దీనిపై రష్యా కూడా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
“రష్యా చమురు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకం. మేము భారత ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నాము. అది భారత ప్రజల, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను ప్రతిబింబిస్తుంది. ఆ లక్ష్యాలు రష్యా-భారత్ సంబంధాలకు విరుద్ధంగా ఉండవు. చమురు, గ్యాస్ అంశాలపై భారత్‌తో సహకారం కొనసాగిస్తాము” అని రష్యా పేర్కొంది. (Russia)
భారత్-అమెరికా సంబంధాలలో తాము జోక్యం చేసుకోబోమని రష్యా చెప్పింది. అయితే, భారత్-రష్యా మధ్య దీర్ఘకాల బంధాన్ని గుర్తుచేసింది. “మేము ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తాము. భారత్‌కు రష్యాతో ద్వైపాక్షిక సంబంధం ఉంది” అని పేర్కొంది.
యుక్రెయిన్‌లో 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపాలని అంటోంది.
కాగా, ట్రంప్ చేసిన కామెంట్లపై భారత్ స్పందిస్తూ.. ట్రంప్, మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ దీనిపై మాట్లాడుతూ.. దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దేశ చమురు దిగుమతులు చేసుకుంటున్నట్లు చెప్పారు.