చరిత్ర సృష్టించిన సన్నా….ఫిన్లాండ్ ప్రధానిగా ఎంపికైన 34ఏళ్ల మహిళ

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2019 / 12:06 PM IST
చరిత్ర సృష్టించిన సన్నా….ఫిన్లాండ్ ప్రధానిగా ఎంపికైన 34ఏళ్ల మహిళ

Updated On : December 9, 2019 / 12:06 PM IST

ఫిన్లాండ్ కొత్త ప్రధానిగా 34ఏళ్ల మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మొదటి వ్యక్తిగా ఆమె రికార్డ్ సృష్టించారు. ఫిన్లాండ్ రాజకీయ నాయకురాలు సన్నా మారిన్ ఈ ఘటన దక్కించుకోబోతున్నారు. ప్రస్తుత ఉక్రెయిన్‌ ప్రధాని ఒలెక్సీ హాన్చరుక్ (35) ఏళ్ల వయస్సులో ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఉక్రెయిన్ పొలిటికల్ సిస్టమ్ లో రాష్ట్రపతే నేరుగా ప్రధానిని ఎంపిక చేస్తారు. ఒలెక్సీ  రికార్డును చెరిపివేస్తూ.. సన్నా మారిన్ 34 ఏళ్లకే సోషల్ డెమోక్రాట్స్ పార్టీ తరుపున ఫిన్లాండ్ ప్రధానిగా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. న్యూజీలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ వయసు 39 సంవత్సరాలు. ఆమె కన్నా సనా ఐదు సంవత్సరాలు చిన్నది. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫిన్లాండ్ లో జరిగిన ఎన్నికల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మరికొన్ని పార్టీలతో కలిసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానిగా ఆంటీ రిన్నె బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయడంలో విఫలం కావడంతో సంక్షోభం తలెల్తింది. పోస్టల్ సమ్మె విషయంలో సంకీర్ణంలోని ఒక పార్టీ విశ్వాసం కోల్పోయాడు. చట్ట సభలో విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో ఆంటి రిన్ ప్రధాని పదవి నుంచి వైదొలగారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సన్నా మరినకు సభ్యులు మద్దతు పలికారు.

ప్రస్తుత ప్రధాని ఆంటి రిన్ తర్వాత ఆ పదవికి సన్నాను పార్టీ ఎంపిక చేసింది. ఫిన్‌లాండ్‌లో మహిళల సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వ ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. చిన్న వయస్సులోనే రాజకీయాలపై పట్టు సాధించడంతో సన్నాకు ఈ అవకాశం దక్కింది. ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సన్నా మారిన్ ఈ వారంలోనే ప్రధానిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఫిన్‌లాండ్‌లో మూడో మహిళా ప్రధానమంత్రిగా కూడా సన్నా మారిన్ చరిత్రకెక్కనున్నారు. 1985లో జన్మించిన సన్నా మారిన్ ఒంటరి తల్లి దగ్గర పెరిగారు. ఆమె తన కుటుంబంలో విశ్వవిద్యాలయంలో చదివిన మొట్టమొదటి వ్యక్తి కూడా.

ఈ సందర్భంగా సన్నా మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. చిన్న వయస్సులోనే ఇంత పెద్ద బాధ్యత తీసుకోవడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు. చాలా కృషి చేయాల్సి ఉంది. నేను ఎన్నడూ నా వయసు, లింగం గురించి ఆలోచించలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన కారణాల గురించి ఆలోచిస్తాను. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న కారణాల గురించి ఆలోచిస్తానని అన్నారు.