World Give Day 2023 : ఇవ్వడంలో ఉన్న ఆనందం అనుభవంలోనే తెలుస్తుంది..
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. కానీ చేసిన సాయం తెలిస్తేనే ఇతరులు స్ఫూర్తి పొందుతారు. సాయం చేయడంలో గొప్ప ఆనందం ఉంటుంది. పొందిన సాయాన్ని మర్చిపోకుండా ఉండటమే సాయం చేసిన వారికి ఇచ్చే నిజమైన గౌరవం. ఈరోజు వరల్డ్ గివ్ డే.

World Give Day 2023
World Give Day 2023 : ఇవ్వడంలో ఎంతో ఆనందం ఉంటుంది. పుచ్చుకునే వారిలో కృతజ్ఞతా భావం ఉంటుంది. సాయం ఎంత చిన్నదైనా కావచ్చు.. కానీ ఎదుటివారికి సాయం చేయాలనే మనస్తత్వం అరుదుగా ఉంటుంది . మే 4 ‘వరల్డ్ గివ్ డే’. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు చాలామంది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
ఎదుటివారి కష్టాలను చూసి చలించిపోయే మనస్తత్వం కొందరిలో ఉంటుంది. వారు అనుక్షణం ఏదో రకంగా సమాజానికి ఏదో ఇవ్వాలని ఆరాటపడుతుంటారు. ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా అలా వారు చేసే సేవ అమూల్యమైనది. ఒకరికి ఇవ్వడం అంటే.. డబ్బులు ఇవ్వడం.. సమయాన్ని ఇవ్వడం.. విజ్ఞానాన్ని పంచడం.. ఇలా ఎన్నో ఇవ్వడంలోకే వస్తాయి. కొంతమంది పేద పిల్లలకు చదువు చెబుతారు. కొందరు ఆసుపత్రిలో ఉన్న చిన్నారులకు బొమ్మలు బహుమతిగా ఇస్తారు. అలా పిల్లల కళ్లలో ఆనందాన్ని చూస్తారు. మనం ఇవ్వడానికి పరిమితులు ఉండవు. ఇవ్వాలనే మంచి మనసు తప్ప.
చదువుకునే టాలెంట్ ఉన్నా ఆర్ధికంగా ఇబ్బందులు పడే విద్యార్ధులకు సాయం చేయడం.. తిండి లేని పేదవారికి సాయం ఇవన్నీ తీసుకునే వారికి ఎంతో సంతోషాన్ని పంచుతాయి. ఆఖరికి మంచి పని చేసిన వ్యక్తికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చినా ఇవ్వడంలోకే వస్తుంది. తెలిసిన వారిని చూసి చిరునవ్వు నవ్వడం.. వారు ఊహించని పని చేసి ఆనందపరచడం.. ఒకరిని ఇన్ స్పైర్ చేయడం ఇవన్నీ కూడా ఇవ్వడంలోకే వస్తాయి. ఎదుటి వారి పట్ల దయను ప్రదర్శించడమే ఇవ్వడం.
కరోనాకి ముందు కరోనా తర్వాత ప్రపంచం తీరు మారిందనే చెప్పాలి. ఎదుటివారికి ఇవ్వడం అంటే అందరూ తెలుసుకున్నారు. అందులోని ఆనందాన్ని అందరూ అనుభవంచారు. తోటివారు కష్టంలో ఉంటే ఆదుకోవాలనే మనస్తత్వాన్ని అలవర్చుకున్నారు. కఠినమైన హృదయం ఉన్నవారు సైతం స్పందించగలిగారు. ఒక చిన్న సాయం సమాజంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకున్నారు.
Chiranjeevi : బలగం సింగర్‌కి ఎదురెళ్లి సహాయం చేస్తున్న చిరు.. మెగాస్టార్ మనసు బంగారం!
ప్రపంచం మొత్తం ఈరోజు ఇతరులకు సాయపడటం అనే కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్లడం ఆనందించదగిన అంశం. అయితే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ఇతరులకు సాయం చేయాలన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. ఇలాంటి రోజునైనా ఇతరులకు ఏదైనా ఇవ్వాలి.. సేవ చేయాలనే గుర్తు చేయడానికి ఇలాంటి రోజుని నిర్వహించడం మంచిదే. అన్నింటికంటే ముఖ్యమైనది మనకి సాయం చేసిన వారు మర్చిపోయినా.. వారిని .. వారి సాయాన్ని ఎప్పటికి గుర్తు పెట్టుకోవడం ఎంతో అవసరం.