Elon Musk Regret: ట్రంప్‌తో ఎలాన్ మస్క్ కాంప్రమైజ్..! ఇదిగో సాక్ష్యం..

ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు మస్క్. కొత్త బిల్లు ఫెడరల్ లోటును మరింత తీవ్రతరం చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టగలదని మస్క్ హెచ్చరించారు.

Elon Musk Regret: ట్రంప్‌తో ఎలాన్ మస్క్ కాంప్రమైజ్..! ఇదిగో సాక్ష్యం..

Updated On : June 11, 2025 / 6:43 PM IST

Elon Musk Regret: నిన్నటి దాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కారాలు మిరియాలు నూరాడు. ట్రంప్ తో సై అంటే సై అన్నాడు. తాడో పేడో చూసుకుందామని డైలాగులు కూడా పేల్చాడు. కట్ చేస్తే.. సారీ సార్ అంటూ.. ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గాడు. అవును.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మస్క్ కాంప్రమైజ్ అయిపోయాడు. తాజాగా మస్క్ పెట్టిన పోస్ట్ ఇందుకు సాక్ష్యం.

ట్రంప్‌పై సోషల్ మీడియా పోస్టుల్లో తాను చేసిన ఆరోపణలపై మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా పోస్టులు చాలా దూరం వెళ్లాయంటూ విచారం వ్యక్తం చేశారు. ”అధ్యక్షుడు ట్రంప్‌పై గత వారంలో నేను పెట్టిన కొన్ని పోస్టులపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. ఇవి చాలా దూరం వెళ్లాయి” అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు మస్క్. అంతే.. ట్రంప్ తో మస్క్ కాంప్రమైజ్ అయిపోయారు గా అనే టాక్ మొదలైంది.

ఇటీవలి కాలంలో ట్రంప్, మస్క్ మధ్య పలు అంశాల్లో విబేధాలు తలెత్తాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వపు పాలసీల విషయంలో తేడాలు వచ్చాయి. ట్రంప్ పాలసీని మస్క్ వ్యతిరేకించారు. ట్రంప్ తెస్తున్న ఓ బిల్లుపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఈ గొడవలు ఎంతవరకు వెళ్లాయంటే.. ఇక ఇద్దరి మధ్య రాజీ కుదరడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు.. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారమూ పెద్ద ఎత్తున జరిగింది.

అటు ట్రంప్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శించారు. మస్క్ పై ఆయన ఫుల్ సీరియస్ గా ఉన్నారు. మస్క్‌పై చర్యలు తప్పవనే ధోరణిలో ట్రంప్ హెచ్చరికలు పంపారు. ఇదే సమయంలో బిజినెస్ లో మస్క్ భారీగా నష్టాలు చవిచూశారు. ఆయన షేర్లు పతనమైపోయాయి. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం కీలకమైన కాంట్రాక్టులు రద్దు చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందనే భయం మస్క్ కు పట్టుకుందని, అంతే.. సడెన్ గా మస్క్ మారిపోయారని అంటున్నారు.

Also Read: హనీమూన్ కేసులో సంచలనం.. నేనే చంపించాను, నేరాన్ని అంగీకరించిన సోనమ్..! సోనమ్‌ను ఉరి తీయాలన్న సోదరుడు..

ట్రంప్, మస్క్ మధ్య గొడవ అలా మొదలైంది…
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించిన కీలక బిల్లు ఇది. ఈ బిల్లు ట్రంప్, మస్క్ మధ్య చిచ్చు రాజేసింది. దీన్ని మస్క్ వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు మస్క్. కొత్త బిల్లు ఫెడరల్ లోటును మరింత తీవ్రతరం చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టగలదని హెచ్చరించారు. అలాగే తన మద్దతు లేకుంటే ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు గెలిచే వారు కారని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ విమర్శలపై ట్రంప్ అంతే తీవ్రంగా స్పందించారు. మస్క్ వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు తమ విజయానికి మస్క్ అవసరమే లేదని చెప్పారు.

రిపబ్లికన్ లేజిస్లేచర్లకు వ్యతిరేకంగా డెమొక్రాట్లకు మస్క్ ఫండింగ్ చేయనున్నట్టు వార్తలు రావడంతో ట్రంప్ ఫుల్ సీరియస్ అయ్యారు. ఇదే జరిగితే మస్క్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మస్క్‌తో మాట్లాడే ఉద్దేశం కూడా తనకు లేదని చెప్పారు.

ఇక ట్రంప్ ను ఉద్దేశించి మస్క్ చేసిన అతిపెద్ద ఆరోపణ జెఫ్రీ ఎపిస్టీన్ కుంభకోణం. ఈ స్కామ్ లో ట్రంప్‌ పేరు ఉందని ఆరోపించారు మస్క్. కానీ, ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయితే ఆ స్కామ్ లో ట్రంప్ పేరును మస్క్ ప్రస్తావించడం మరింత సంచలనం రేపింది. ఆ తర్వాత ఆ ట్వీట్లను తొలగించారు. ఇప్పుడు ఏకంగా తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు మస్క్. అధ్యక్షుడి గురించి గత వారం తాను పెట్టిన కొన్ని పోస్టులు చాలా దూరం వెళ్లిపోయాయి, దీనిపై తనకే చాలా బాధగా ఉందని వాపోయారు మస్క్.

ప్రభుత్వ వృథాను తగ్గించడంలో ఫెడరల్ అడ్వైజరీ అయిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డీఓజీఈ) హెడ్‌గా మస్క్ పాత్రను ట్రంప్ గతంలో ప్రశంసించారు. అయితే ప్రభుత్వ ఖర్చుల ప్రాధాన్యతలపై అసంతృప్తితో ఉన్న మస్క్.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. అలా ట్రంప్, మస్క్ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. కట్ చేస్తే.. సారీ సార్ అంటూ ట్రంప్ తో కాంప్రమైజ్ అయిపోయారు మస్క్.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం బాగా కష్టపడ్డ వారిలో ఎలాన్ మస్క్ ఒకరు. ట్రంప్ కోసం సోషల్ మీడియాలో భారీగానే ప్రచారం చేశారు. అందుకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే మస్క్ కు కీలక పదవి ఇచ్చారు ట్రంప్. డోజ్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ)కి చీఫ్‌గా మస్క్ ని నియమించారు. అయితే ప్రభుత్వ ఖర్చులపై ట్రంప్ వైఖరితో విబేధించారు మస్క్. ట్రంప్ ప్రభుత్వ విధానాలపై అభిప్రాయ భేదాల కారణంగా మస్క్ఇటీవలే తన పదవి నుంచి కూడా వైదొలిగారు.