మనోళ్లు మారరా..? విమానం దిగేటప్పుడు కూడా తోపులాటేనా?

కొవిడ్ -19 యుగంలో మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లలోనూ మార్పులు వచ్చాయి. కానీ, కొన్ని విషయాలు మాత్రమే ఎప్పటికీ మారవు. అది ఇలానే ఉంటుంది. విమాన మర్యాద విషయానికి వస్తే మనోళ్లపై అభిప్రాయమిది. విమాన ప్రయాణాల్లో తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయరు. విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండింగ్ అవుతున్నప్పుడే ఫోన్ కాల్స్ చేస్తారు. ఏదో ప్రపంచం అంతమైపోతున్నట్టుగా విమానం నుండి దిగేందుకు సీట్ల నుంచి దూకుతారు. ఇదే తంతు ఇప్పుడు కరోనా యుగంలోనూ కొనసాగుతోంది. సామాజిక దూరం పాటించాల్సింది పోయి ఒక్కసారిగా విమానంలో నుంచి దిగేందుకు తెగ ఆత్రుత పడుతుంటారు. కనీసం ప్లైట్ ప్రోటోకాల్ పాటించరనే అభిప్రాయం వ్యక్తవుతోంది. కాసేపు ఆగొచ్చు కదా.. ఏమైపోతుంది.. అలా తోసుకుంటూ పోకుంటే.. నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు దిగితే పని అయిపోతుంది కదా.. ఎలాగో అందరూ దిగాల్సిన వాళ్లే.. కాసేపు ఓపిక పడితే ఏమవుతుందని చూసేవాళ్లకు అనిపించకమానదు.
రెడిట్‌లో పోస్ట్ చేసిన ఒక ఫొటో చూస్తే.. మీకే తెలుస్తుంది. అందరూ ముఖ కవచాలు, ముసుగులు ధరించి ఉన్నారు. కానీ, వారు తమ సీట్ల నుండి విమానం దిగేందుకు సామాజిక దూర ప్రమాణాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు! ఎందుకింత ఆతురుతగా ఉన్నారు? విమానం నుంచి నిష్క్రమించడం వల్ల మహమ్మారి ఆగిపోతుందా? ఒక్కొక్కరుగా విమానం నుంచి బయటపడేందుకు కొద్ది నిమిషాలు వేచి ఉన్న కలిగే ఇబ్బందేమి ఉండదు. అయినా దిగాలన్న ఆత్రుతే ఎక్కువగా కనిపిస్తుంటుంది.
కరోనా సంక్షోభ సమయంలో భారతదేశంలోని విమానాశ్రయాలు పనిచేయడం ప్రారంభించిన తరువాత.. చెక్-ఇన్ క్యూలు, సామానుపై అతినీలలోహిత క్రిమిసంహారకం చల్లడం, ప్రయాణించే వ్యక్తుల మధ్య దూరాన్ని కొనసాగించడం వంటి చర్యలను చేపట్టాయి. విమానం దిగే సమయంలో క్యూలలో ఒకరిని ఒకరు రుద్దుకోవడం, ముందుకు నెట్టుకుంటూ దూసుకెళ్లడం చేయకూడదు. మనలో చాలా మందికి జీవన విధానానికి తగినట్టుగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
Pictures from SpiceJet’s domestic flight operations on May 26@flyspicejet @awnusharma pic.twitter.com/5eyh5UNhdv
— CNBC-TV18 (@CNBCTV18News) May 26, 2020
కొవిడ్-19 వ్యాప్తితో 59 రోజులు పూర్తి అయిన తర్వాత మే 25న, నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విమానయాన సంస్థలను తిరిగి ప్రారంభించటానికి అనుమతించింది. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA కఠినమైన చర్యలతో ముందుకు వచ్చింది. ప్రయాణీకులు, చెక్-ఇన్ కౌంటర్ల మధ్య తగినంత స్థలం ఉండేలా చూడటం, ఇద్దరు ప్రయాణీకుల మధ్య ఒక సీటు ఖాళీగా ఉండాలి. ప్రయాణీకుల మధ్య (కనీసం ఒక మీటర్) వ్యక్తిగత కౌంటర్ల మధ్య చెక్-ఇన్ కౌంటర్లలో తగినంత దూరంతో పాటు, విమానయాన సంస్థలు కూడా చెక్-ఇన్ కౌంటర్లలో భద్రతా తనిఖీల సమయంలో ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయాలి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దేశంలోని అన్ని షెడ్యూల్ విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు తన సర్క్యులర్‌లో పేర్కొంది. సర్క్యులర్ ప్రకారం.. చెక్-ఇన్ సమయంలో సీట్ల కేటాయింపు ఇద్దరు ప్రయాణీకుల మధ్య సీటు ఖాళీగా ఉండేలా చూడాలి. క్యాబిన్ సిబ్బంది ప్రయాణీకులకు సర్వీసు అందించే సమయంలోనూ తగిన దూరం ఉండేలా జాగ్తత్తలు పాటించాలి. అప్పుడే ఇలాంటి సమస్యలను అధిగమించగలమంటున్నారు విశ్లేషకులు.