పాకిస్థాన్ స్కూల్లో సూసైడ్ కార్ బాంబ్.. చిన్నారులు మృతి..

Suicide bomb
Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకొని జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో నలుగురు చిన్నారులు మృతించెందారు. మరో 38 మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిలో చాలా మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
Also Read: పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం.. హోం మంత్రి ఇంటికి నిప్పు.. జనంపై కాల్పులు.. రచ్చ రచ్చ
ఖుజ్ధార్ డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ చెప్పిన వివరాల ప్రకారం.. బస్సులో సైనిక పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టిందని తెలిపారు. అయితే, ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించి ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. కానీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పనిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రావిన్సులో పౌరులు, భద్రతా దళాలకు మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ ఘటనపై మంత్రి మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. శత్రువులు అమాయక పిల్లలను లక్ష్యంగా చేసుకొని అతి క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. అలాంటి మృగాల పట్ల దయచూపాల్సిన అవసరం లేదని అన్నారు. ఇదిలాఉంటే.. కొన్ని రోజుల క్రితమే బలోచిస్థాన్‌లోని ఖిల్లా అబ్ధుల్లా అనే ప్రాంతంలో కారుబాంబు పేలడంతో నలుగురు చనిపోయారు. ఈ ప్రదేశం అఫ్గాన్ సరిహద్దుల్లో ఉంటుంది.
బలూచిస్తాన్ లో వేర్పాటువాదులు సైనిక, పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుండటం సాధారణమే. అయితే, పాఠశాల పిల్లలపై దాడులు చాలా అరుదు. 2014లో పెషావర్ లోని సైనిక పాఠశాలపై తాలిబన్లు జరిపిన విధ్వంసకర దాడిలో 154 మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు.