అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. మాజీ బాయ్‌ఫ్రెండ్ అపార్టుమెంట్‌లో మృతదేహం.. అసలేం జరిగిందంటే?
Telugu woman murdered in America : అమెరికాలో తెలుగు యువతి నికిత గొడిశాల (27) హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అపార్ట్ మెంట్లో మృతదేహం లభ్యమైంది.
Nikitha Godishala
- అమెరికాలో తెలుగు యువతి హత్య
- మాజీ ప్రియుడు అపార్ట్‌మెంట్‌లో మృతదేహం లభ్యం
- పారారీలో మాజీ ప్రియుడు.. సెర్చ్ వారెంటు జారీ చేసిన అధికారులు
Telugu woman murdered in America : అమెరికాలో తెలుగు యువతి నికిత గొడిశాల (27) దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. న్యూఇయర్ వేడుకల సమయం నుంచి అంటే.. గత నెల 31వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదు. ఈ నెల 2వ తేదీన నికిత కనిపించడం లేదని.. చివరిసారిగా ఎల్లికాట్ సిటీలో చూసినట్లుగా పోలీసులకు ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత అతను ఇండియాకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో, అర్జున్ శర్మపై అనుమానంతో మేరీల్యాండ్‌లోని తన అపార్టుమెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. నికిత మృతదేహం లభ్యమైంది.
Also Read : Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన.. భార్యను లేపుకెళ్లాడని.. పోలీస్ స్టేషన్ గేటు ముందే నరికి..
నికిత మృతదేహంపై కత్తిపోటు గాయాలను అమెరికా పోలీసులు గుర్తించారు. నికితను హత్యచేసి అర్జున్ ఇండియాకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అర్జున్ అరెస్టు కోసం అక్కడి అధికారులు ఫెడరల్ పోలీసుల సహాయం కోరారు. నికిత స్వస్థలం సికింద్రాబాద్‌గా తెలుస్తుంది.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిఖిత.. ప్రస్తుతం మేరీల్యాండ్‌లోని వెడా హెల్త్‌లో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. నికిత శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో డిసెంబర్ 31వ తేదీనే మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఆమెపై దాడిచేసి హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నికిత మృతిపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని పేర్కొంది. కేసు దర్యాప్తునకు సంబంధించి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.
