Taliban
Afghanistan Taliban : అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావటంతో ఆ దేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాలిబన్ల గత చరిత్రను తలుచుకుని వణికిపోతున్నారు. దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబాన్లు తనను చంపేస్తారని అఫ్ఘానిస్తాన్ లో తొలి అతి పిన్న వయసు కలిగిన మహిళా మేయర్ జరీఫా ఘఫారీ చెప్పారు.
అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో వాళ్లు తనను చంపడానికి వస్తారని జరీఫా అంటోంది. ‘నేను ఇంట్లోనే కూర్చున్నాను. వాళ్ల కోసం వేచి చూస్తున్నాను. నాకు, నా కుటుంబానికి సాయం చేయడానికి ఎవరూ లేరు. నా భర్త, కుటుంబంతో కలిసి ఇక్కడే ఉన్నాను. నాలాంటి వారి కోసం వాళ్లు వస్తారు. చంపుతారు. దేశాధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ ఘనీతోపాటు ఇతర మంత్రులు కూడా దేశం వదిలి పారిపోగా.. నేను ఎక్కడికి వెళ్లాలి అని జరీఫా అంటోంది.
కాగా కొన్ని వారాల క్రితం జరీఫా ఘఫారీ ఓ అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ భవిష్యత్తు బాగానే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆమె ఆశలు అడియాసలయ్యాయి. 2018లో మైదాన్ వార్దాక్ ప్రావిన్స్‌కు తొలి మహిళా మేయర్‌గా ప్రమాణం స్వీకారం చేసిన ఆమె.. ఇప్పుడు తాలిబన్ల రాక కోసం ఎదురు చూస్తున్నారు. గతంలోనూ తాలిబన్ల నుంచి ఆమెకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఆమెపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. 2020, నవంబర్ 15న ఆమె తండ్రి జనరల్ అబ్దుల్ వసీ ఘఫారీని మిలిటెంట్లు కాల్చి చంపారు.
మూడు వారాల క్రితం దేశ యువతపై ఎన్నో ఆశలు పెట్టుకొని మాట్లాడిన ఆమె.. ఇప్పుడు పూర్తి నిస్సహాయురాలుగా మారిపోయారు. కాబూల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లదని తాము భావించేవాళ్లమని జరీఫా అన్నారు. అయితే గత ప్రభుత్వంలో పని చేసిన ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్లు ప్రకటించారు. కానీ తాలిబాన్ల గత చరిత్ర చూసిన వాళ్లు మాత్రం ఈ మాటలను నమ్మడం లేదు. మరీ ముఖ్యంగా మహిళలంటే ఇంటికే పరిమితమయ్యే సెక్స్ బానిసలన్న తాలిబన్ల సిద్ధాంతం.. అక్కడి మహిళల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
అఫ్ఘానిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతం అయిన సంగతి తెలిసిందే. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 10 రోజులుగా దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ కాబూల్‌లోకి దూసుకెళ్లారు. అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధ్యక్ష పదవికి ఘనీ రాజీనామా చేసి, దేశం విడిచి పారి పోయారు. తాలిబన్లు మాజీ రక్షణ మంత్రి అలీ అహ్మద్ జలాలీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. అఫ్ఘాన్ ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.