కువైట్ అగ్నిప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మృతి.. స్వదేశానికి మృతదేహాలు

కువైట్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన భారతీయులు 45 మందికాగా.. వారిలో ముగ్గురు ఏపీకి చెందినవారు ఉన్నారు.

కువైట్ అగ్నిప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మృతి.. స్వదేశానికి మృతదేహాలు

kuwait Fire Incident : గల్ఫ్ దేశం కువైట్ లో రెండురోజుల క్రితం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 49మంది మరణించగా మరో 50మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 45మంది భారతీయులేనని అధికారులు తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తుంది. కువైట్ చేరుకున్న వాయుసేన విమానం శుక్రవారం ఉదయం మృతదేహాలతో తిరిగి ఇండియాకు బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో ఆ విమానం 45మంది మృతదేహాలతో కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఆ తరువాత మృతదేహాలను ఢిల్లీకి తీసుకెళ్లి.. ఢిల్లీ నుంచి వారివారి స్వస్థలాలకు మృతదేహాలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read : Tamilsai : అమిత్ షా సీరియస్ వార్నింగ్‌.. అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చిన తమిళిసై సౌందరరాజన్

కువైట్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన భారతీయులు 45 మందికాగా.. వారిలో కేరళ (23), తమిళనాడు (7), ఏపీ (3), యూపీ (3), ఒడిషా (2), బీహార్, పంజాబ్, కర్ణాటక, బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందినవారు మరికొందరు
ఉన్నారు. మృతుల్లో ఏపీకి చెందిన వారు ముగ్గురు ఉండగా.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలానికి చెందిన ఇద్దరు సజీవదహనం అయ్యారు. అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వర్, ఖండవల్లికి చెందిన ముల్లేటి సత్యనారాయణ అగ్నిప్రమాదంలో మరణించారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read : కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 40మంది భారతీయులు మృతి, ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం

కువైట్ అగ్ని ప్రమాదంలో ఉద్దానం వాసికూడా మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకబద్ర గ్రామంకు చెందిన తామాడ లోకనాదం నాలుగేళ్లుగా కువైట్‌లో పని చేస్తున్నాడు. గత నెలలో సొంత గ్రామానికి వచ్చిన అత‌ను.. ఈనెల 11వ తేదీన కువైట్ వెళ్లాడు. ఘటన జరిగిన ముందురోజు రాత్రే కంపెనీ అపార్ట్ మెంట్‌కు లోకనాధం చేరుకున్నాడు. కంపెనీ రిజిస్టర్ లో ఎంట్రీ లేకపోవడంతో లోక‌నాదం మ‌ర‌ణించిన‌ట్లు ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. నాలుగేళ్లుగా కువైట్ ఎన్‌బీటీసీ సంస్థ‌లో లోకనాథం ప‌నిచేస్తున్నాడు. లోకనాధం మృతితో కుటుంబ సభ్యులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. గ్రామంలోనూ విషాదం నెల‌కొంది. ఈ అగ్నిప్రమాదం సమయంలో తెలంగాణకు చెందిన మరో ముగ్గురు భవనంపై నుంచిదూకి స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నారు.