డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య.. యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న సమయంలో షూటింగ్..

Charlie Kirk: కిర్క్ అమెరికా రాజకీయాల్లో బాగా ప్రభావం చూపారు. యువ ఓటర్లలో ట్రంప్‌కు మద్దతు పెరగడానికి సహకరించారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య.. యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న సమయంలో షూటింగ్..

Charlie Kirk

Updated On : September 11, 2025 / 11:37 AM IST

Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ (31)ను ఉటా విశ్వవిద్యాలయంలో ఓ దుండగుడు కాల్చి చంపాడు. కన్జర్వేటివ్‌ యాక్టివిస్ట్‌గా పనిచేస్తూ, టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ సీఈవో, సహ వ్యవస్థాపకుడిగా చార్లీ కిర్క్ ఉన్నారు.

ఉటా వర్సిటీలో జరిగే ఈవెంట్‌కు చార్లీ కిర్క్ వస్తున్నారని తెలిసి, కొన్ని రోజుల ముందు నుంచే వ్యతిరేకత ఎదురైంది. కిర్క్‌ పాల్గొనే ఈవెంట్‌ను రద్దు చేయాలంటూ 1,000 మంది సంతకాలు చేసి ఓ ఫిర్యాదును వర్సిటీకి అందించారు.

అయినప్పటికీ భావ ప్రకటన స్వేచ్ఛకు సపోర్టు చేసే తమ వర్సిటీ కిర్క్‌ ఈవెంట్‌ను రద్దు చేయబోదని ఆ విశ్వవిద్యాలయ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కిర్క్ ఆ ఈవెంట్‌కు వచ్చారు. (Charlie Kirk)

ఉటా వ్యాలీ యూనివర్సిటీలో మాట్లాడుతున్న సమయంలో కిర్క్‌ను ఓ దుండగుడు కాల్చాడు. కాల్పుల శబ్దం వినిపించగానే షాక్‌కు గురైన అక్కడి వారంతా పరుగులు తీశారు. కిర్క్‌ను ఆసుపత్రికి తరలించగా, ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

లెజెండరీ చార్లీ కిర్క్ ఇక లేరని, అమెరికాలో యువత మనసు అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. కిర్క్‌ను అందరూ అభిమానించారని, ఇప్పుడు ఆయన మనతో లేరని అన్నారు. ఆయన భార్య ఎరికాకు, కుటుంబానికి మెలానియాతో కలిసి తాను ప్రగాఢ సానుభూతి చెబుతున్నానని ట్రంప్ తెలిపారు.

మాజీ ఉటా కాంగ్రెస్ సభ్యుడు జాసన్ చాఫెట్జ్ మాట్లాడుతూ.. ఈవెంట్‌లో యువత ప్రశ్నలు అడుగుతుండగా కిర్క్‌ సమాధానాలు చెబుతున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయని అన్నారు.

“మొదటి ప్రశ్న మతంపై వచ్చింది. దానిపై 15-20 నిమిషాలు మాట్లాడారు. రెండో ప్రశ్న ట్రాన్స్‌జెండర్ షూటర్లు, మాస్ షూటర్ల గురించి వచ్చింది. అదే సమయంలో కాల్పులు జరిగాయి” అని చాఫెట్జ్ అన్నారు.

కాగా, కిర్క్ అమెరికా రాజకీయాల్లో బాగా ప్రభావం చూపారు. యువ ఓటర్లలో ట్రంప్‌కు మద్దతు పెరగడానికి సహకరించారు. కిర్క్‌ వాగ్ధాటి అద్భుతంగా ఉంటుంది. ఆ నైపుణ్యాలతోనే కిర్క్ 2012లో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏను స్థాపించారు. యువతలో కన్సర్వేటివ్ ఆలోచనలను వ్యాప్తి చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫాంలలో వలస వ్యతిరేక విధానాలు, క్రైస్తవమతం పట్ల విశ్వాసాన్ని బహిరంగంగా సమర్థించేవారు. క్యాంపస్‌లలో ఆయన ప్రసంగాలు లిబరల్ ఆలోచనలున్న వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత రేపింది.

అప్పట్లో ఇండియా గురించి కిర్క్‌ పోస్ట్
చార్లీ కిర్క్‌ గతంలో అమెరికాకు వచ్చే భారతీయులకు వ్యతిరేకంగా ఓ పోస్ట్ చేశారు. భారత్‌ నుంచి అమెరికాకు వచ్చేవారికి మరిన్ని వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. తమ దేశం ఇప్పటికే నిండిపోయిందని, సొంత దేశ ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.