Donald Trump: దూకుడు పెంచిన ట్రంప్.. కీలక పదవుల్లో వరుసగా నియామకాలు.. పూర్తి జాబితా ఇదే..
అధ్యక్ష బాధ్యతలు చేపట్టకమునుపే డొనాల్డ్ ట్రంప్ దుకుడుగా వ్యవహరిస్తున్నారు. తన కొత్త అడ్మినిస్టేషన్ లో కీలక పదవుల్లో నియామకాలు చేస్తున్నారు.

Donald Trump
Trump 2.0 team: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి, మాజీ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే, ట్రంప్ సైతం తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి కీలక పదవుల్లో నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈక్రమంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టకమునుపే దుకుడుగా వ్యవహరిస్తూ.. కొత్త అడ్మినిస్టేషన్ లో కీలక పదవుల్లో నియామకాలు చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి సహా పలువురికి కీకలక పదవుల్లో నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వారి వివరాలను పరిశీలిస్తే..
Also Read: DOGE : అమెరికాలో లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సిందేనా? ఫెడరల్ ఉద్యోగులకు ఇక కాళరాత్రులేనా?
వివేక్ రామస్వామి, ఎలోన్ మస్క్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ):
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామిలకు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరిని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే డోజ్ ప్రాజెక్టు లక్ష్యం. సమర్ధత ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థల్లో మస్క్, వివేక్ మార్పులు తెస్తారని, వీరు నా పాలనకు మార్గం సిద్ధం చేస్తారని ఆశిస్తున్నాని ట్రంప్ పేర్కొన్నారు.
సూసీ వైల్స్ (వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్) :
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా సూసీ వైల్స్ ను ట్రంప్ నియమించారు. సూసీ వైల్స్ ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారంలో సీనియర్ సలహాదారు, ట్రంప్ బృందంలో విశ్వసనీయ సభ్యురాలు. ఆమె వయస్సు 67 సంవత్సరాలు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను విజయతీరాలకు చేర్చడంలో ఆమెది కీలక పాత్ర. ప్లోరిడాకు చెందిన సూసీ.. దీర్ఘకాలంగా రిపబ్లికన్ వ్యూహకర్తగా ఉన్నారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు అవిశ్రాంతంగా ఆమె కృషి చేస్తారు. దేశం గర్వపడేలా పనిచేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని ట్రంప్ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మైక్ వాల్ట్ (జాతీయ భద్రతా సలహాదారు) :
ట్రంప్ 2.0 అడ్మినిస్టేషన్ లో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) ప్లోరిడా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్ట్ ఎంపికయ్యాడు. ఇండియా కాకస్ కు కో-చైర్మన్ అయిన మైక్ వాల్ట్ 2019 నుంచి యూఎస్ హౌస్ ఆప్ రిప్రజెంటేటివ్స్ లో పని చేశారు. ఆయన ఆఫ్ఘనిస్థాన్, మిడిల్ ఈస్ట్ లో అమెరికా విస్తరణ కార్యక్రమాల్లో పనిచేశారు. డిఫెన్స్ సెక్రటరీ డొనాల్డ్ రమ్స్ ఫెల్డ్ ఆధ్వర్యంలో పెంటగాన్ లో ఆఫ్ఘనిస్థాన్ విధాన సలహాదారుగా కూడా పని చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడంపై హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గా మైక్ వాల్ట్ .. అధ్యక్షుడు జో బైడెన్ ను ప్రశ్నించి వార్తల్లోకి ఎక్కారు. యుక్రెయిన్ ఆయుధ అవసరాలు, రష్యా – ఉత్తరకొరియా సంబంధాలు, మధ్య ప్రాచ్య వైరుద్యాలు, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పరిస్థితితో సహా వివిధ అంతర్జాతీయ సవాళ్లు ఆయన పరిష్కరిస్తారని ట్రంప్ భావిస్తున్నారు.
టామ్ హోమన్ (బోర్డర్ జార్) :
డొనాల్డ్ ట్రంప్ 2.0లో 62ఏళ్ల టామ్ హోమన్ ను బోర్డర్ జార్ గా నియమించినట్లు ప్రకటించారు. ట్రంప్ గత పాలకవర్గంలో యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా హోమన్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన దక్షిణ, ఉత్తర సరిహద్దులను పర్యవేక్షించడంతోపాటు, సముద్ర, విమానయాన భద్రతను పర్యవేక్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాడని ట్రంప్ పేర్కొన్నాడు. సరిహద్దు భద్రతా వ్యవహారాలను నిర్వహించడంలో ఆయనకు మంచి పట్టు ఉందని, అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిని పంపించే బాధ్యతకూడా ఆయనే నిర్వహిస్తారని.. టామ్ హోమన్ ఈ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తారనడంలో తనకు ఎటువంటి సందేహం లేదని తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు.
ఎలిస్ స్టెఫానిక్ (ఐక్యరాజ్యసమితిలో US రాయబారి) :
తన హయాంలో ఐక్యరాజ్య సమితిలో యూఎస్ రాయబారిగా ఎలిస్ స్టెఫానిక్ వ్యవహరిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ వ్యూహ బృందంలోని కీలక సభ్యుల్లో ఎలిస్ స్టెఫానిక్ ఒకరు. ‘నా కేబినెట్‌లో ఎలిస్ స్టెఫానిక్‌ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నామినేట్ చేయడం నాకు గౌరవంగా ఉంది. ఆమె బలమైన, కఠినమైన, తెలివైన ‘అమెరికా ఫస్ట్’ యోధురాలిగా ఉన్నారని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
స్టీఫెన్ మిల్లర్ (పాలసీ కోసం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్) :
డొనాల్డ్ ట్రంప్ తన దీర్ఘకాల ఇమ్మిగ్రేషన్ సలహారు అయిన స్టీఫెన్ మిల్లర్ ను వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పాలసీకోసం ఎంపిక చేశారు. గతంలో ట్రంప్ పరిపాలనలో సీనియర్ సలహాదారుగా మిల్లర్ పనిచేశారు. 2017 నుంచి 2021 వరకు ఇమ్మిగ్రేషన్ విధానాలను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ట్రంప్ పదవీ కాలంలో యూఎస్ – మెక్సికో సరిహద్దు గోడ, ప్రయాణ నిషేధం వంటి చర్యలను అమలు చేయడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. గత నెలలో న్యూయార్క్‌లో జరిగిన ట్రంప్ ప్రచార ర్యాలీలో “అమెరికా అమెరికన్లు మరియు అమెరికన్లకు మాత్రమే” అని చెప్పాడు.
లీ జెల్డిన్ (ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) :
44ఏళ్ల లీ జెల్దిన్ ను పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీకి నాయకత్వం వహించడానికి డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశాడు. అతనికి ఈ ఏజెన్సీపై అనుభవం లేకపోయినా.. తనకు నమ్మకమైన మద్దతుదారుగా ఉండటంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. లీ జెల్డిన్ న్యూయార్క్ కు చెందిన మాజీ యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు. లీ జెల్డిన్ “పర్యావరణ సమీక్ష, నిర్వహణపై కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆరోగ్యకరమైన, చక్కటి నిర్మాణాత్మక మార్గంలో ఎదగడానికి వీలు కల్పిస్తుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాశారు.