అన్నంతపని చేసిన ట్రంప్…WHOకు నిధులు ఆపేసిన అమెరికా

కరోనా హాట్ స్పాట్ గా అమెరికా మారడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కారణంటూ కొన్ని రోజులుగా డబ్యూహెచ్ వోపై తీవ్ర విమర్శలు చేస్తుూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆ సంస్థపై ప్రతీకార చర్యలకు దిగారు. తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందని ఆరోపణలు చేస్తున్న ట్రంప్‌…ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నంత పని చేశారు.

తమ దేశం నుంచి సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ట్రంప్ ఆదేశించారు. WHO బాధ్యతాయుతంగా నడుచుకునేలా ఆదేశించే హక్కు సంస్థకు అత్యధిక నిధులు అందిస్తున్న అమెరికాకు ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో WHO చైనాకు పక్షపాతిగా వ్యవహరించిందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. చైనా సహా ఇతర దేశాల ప్రయాణాలపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించడం WHO తీసుకొన్న ‘అత్యంత వినాశకరమైన’ నిర్ణయమన్నారు ట్రంప్. 

అమెరికా తీసుకున్న చాలా నిర్ణయాల్ని WHO వ్యతిరేకించిందని ఈ సందర్భంగా ట్రంప్‌ తెలిపారు. కానీ, డబ్ల్యూహెచ్‌ఓతో ఏకీభవించని తాను చైనా ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేశామని తెలిపారు. తద్వారా చెప్పలేనంత మంది ప్రాణాల్ని రక్షించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అనారోగ్య ముప్పు తలెత్తినప్పుడు ప్రపంచ దేశాలూ సరైన సమాచారం కోసం డబ్ల్యూహెచ్‌ఓపై ఆధారపడతాయని గుర్తుచేశారు. కానీ, సంస్థ మాత్రం ఈ కనీస బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు కరోనా వైరస్‌ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. మరోవైపు WHOకు నిధులు ఆపేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని చైనా తప్పుబట్టింది. డబ్యూహెచ్ వోకు తాము అదనంగా నిధులు అందించనున్నట్లు ప్రకటించింది.

కాగా,అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 6లక్షల 44వేల 348 కి చేరగా,28వేల 554మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూయార్క్ లోనే ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా 2లక్షల 14వేల 648 కేసులు నమోదయ్యాయి. అమెరికా మొత్తం నమోదైన కరోనా మరణాల్లో దాదాపు సగం మరణాలు న్యూయార్క్ లోనే నమోదయ్యాయి. న్యూయార్క్ లో ఇప్పటివరకు 11వేల 586కరోనా మరణాలు నమోదయ్యాయి.

Also Read | 2022 వరకు ‘సామాజిక దూరం’ పాటించక తప్పదు.. హార్వర్డ్ రీసెర్చర్ల హెచ్చరిక!