బైడెన్ ప్రమాణ స్వీకారానికి పిలిచినా వెళ్లను : ట్రంప్

Trump to skip Biden inauguration : అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి అంతకుముందు అధ్యక్షుడు హాజరు కావడం అమెరికాలో సంప్రదాయంగా వస్తోంది. ఇప్పడు ఆ సంప్రదాయానికి ట్రంప్ తెర దించనున్నారు. 1869 తరువాత అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ వారసత్వ ప్రమాణ స్వీకారానికి హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి కానుంది.
ట్రంప్ టెంపరితనం, దురుసు ప్రవర్తన, ఓటమితో వివాదాస్పదాలకు కారణమయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ పదవి వీడే ముందు మరో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ భవనంపై దాడికి మద్దతుదారులను ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రంప్ తనని తాను క్షమించుకునే అవకాశాల గురించి యోచిస్తున్నారు.
క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ట్రంప్ చట్టపరంగా ముప్పును ఎదుర్కొనే అవకాశముంది. దీని నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ తన ముందున్న ఏకైక మార్గం స్వీయ క్షమాభిక్ష భావిస్తున్నారు. అధ్యక్షుడికి తనని తాను క్షమించుకునే హక్కు ఉంటుందంటూ మూడేళ్ల క్రితమే ట్రంప్ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది.
రాజ్యాంగ నిపుణులు అధ్యక్షుడికి స్వీయ క్షమాభిక్ష హక్కు ఉందని తనతో చెప్పారని ట్రంప్ సమర్థించుకున్నారు. ట్రంప్ ట్విటర్‌లో శాంతి మంత్రం వల్లిస్తూ వీడియో కూడా విడుదల చేశారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా కాంగ్రెస్ జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించిందని ట్వీట్ లో పేర్కొన్నారు. జనవరి 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందంటూ ట్రంప్ ఓటమిని అంగీకరించారు.