చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ రాజు

  • Published By: nagamani ,Published On : November 4, 2020 / 01:28 PM IST
చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న దుబాయ్ రాజు

Updated On : November 4, 2020 / 1:37 PM IST

UAE prime minister corona vacsin : చైనా ప్రభుత్వానికి చెందిన ఫార్మా కంపెనీ ‘సినోఫార్మ్’ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోం వేయించుకున్నారు. టీకా వేయించుకుంటుండగా తీసిన ఫొటోను షేక్ మహ్మద్ మంగళవారం (నవంబర్ 3,2020) తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రతీ ఒక్కరూ కరోనా నుంచి భద్రతగా ఉండాలని..ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. యూఏఈ ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపారు.


కాగా.. ఈ టీకా ప్రస్తుతం మూడో దశ పరీక్షల్లో ఉన్నప్పటికీ అత్యవసర ప్రాతిపదికన దుబాయ్ ఈ వ్యాక్సిన్ వినియోగిస్తోంది. రాజుతోపాటు దుబాయ్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా టీకాను వేయించుకున్నారు. అనంతరం యుఎఇ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మహ్మద్ అబ్దుల్లా అల్-గెర్గావి కూడా ఈ టీకా వేయించుకున్నారు.



ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరికీ వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా..జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం యూఏఈలోఇప్పటి వరకు 1,35,141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 497 మంది మృత్యువాత పడ్డారు.


చైనా దేశం నుంచి ప్రపంచ దేశాలకు అంటుకున్న కరోనా వైరస్ వ్యాప్తి ఏడాది కావస్తున్నా ఈ మహమ్మారి భయం మాత్రం ప్రపంచాన్ని ఇంకా వీడలేదు. యూరప్ దేశాల్లో వైరస్ సెకండ్ వేవ్ కనిపించడంతో చాలా దేశాలు మళ్లీ రెండోసారి లాక్‌డౌన్ ప్రకటించాయి.



మరికొన్ని దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి.కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. ఈక్రమంలో చైనా నుంచి వ్యాపించి ఈ కరోనా మహమ్మారికి సంబందించిన వ్యాక్సిన్ చైనా తయారు చేసింది. ఈ క్రమంలో చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ను దుబాయ్ రాజు వేయించుకోవటం విశేషంగా మారింది.