బ్రిటన్ సర్కార్ నిర్ణయం…విదేశీ విద్యార్థులకు వర్క్ వీసా పొడిగింపు

బ్రిటన్ యూనివర్శిటీల్లో చదివుతున్న విదేశీ విద్యార్థులకు వర్క్ వీసాల కాల పరిమితిని పెంచాలని యూకే ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. విదేశీ విద్యార్థులకు 2సంవత్సరాలు వర్క్ వీసాను పొడిగించాలని యూకే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇది 2012 లో సంకీర్ణ ప్రభుత్వం రద్దు చేసిన విధానానన్ని తిరిగి తీసుకురావడం అవుతుంది.
గతంలో బ్రిటీష్ విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రులైన విదేశీ విద్యార్థులకు రెండేళ్ల వర్క్ వీసా ఇచ్చేవాళ్లు. అయితే 2012లో బ్రిటన్ హోం సెక్రటరీగా ఉన్న మాజీ ప్రధాని థెరిస్సా మే ఆ రెండేళ్ల విధానాన్ని తొలగించారు. రెండేళ్ల పోస్ట్-స్టడీ వర్క్ వీసా “చాలా ఉదారంగా” ఉందంటూ ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్..బ్రెగ్జిట్ తర్వాత ఎక్కువమంది విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానాల్లో భాగంగా థెరిస్సా మే తొలగించిన రెండేళ్ల వర్క్ వీసా విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. దీనిపై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పందిస్తూ… యూకేలో చుదువుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య విషయంలో ఎలాంటి లిమిట్ లేదు. విదేశీ విద్యార్థులను ఆకర్షించడం,స్వాగతించడం కొనసాగుతోందని తెలిపింది.
ప్రస్తుతం, బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీలు కలిగిన గ్రాడ్యుయేట్లకు పని చేసుకునేందుకు నాలుగు నెలలు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే తీసుకురాబోయే విధానం ప్రకారం…వచ్చే ఏడాది నుండి అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లందరూ యూకేలో రెండేళ్లపాటు పనిచేయడానికి అర్హత పొందుతారు. అయితే నాలుగు నెలల పరిమితిని ఆరు నెలలకు, డాక్టరేట్లు ఉన్నవారికి పరిమితిని ఒక సంవత్సరానికి పెంచాలని ప్రతిపాదించిన హోమ్ ఆఫీస్ లేటెస్ట్ ఇమ్మిగ్రేషన్ శ్వేతపత్రం కంటే ఇప్పుడు తీసుకురాబోయే పరిమితి ఎక్కువగా ఉండబోతుంది.