చైనా విద్యార్ధులపై నిషేధం…హాంకాంగ్ కు ప్రత్యేక హోదా తొలగింపు : ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : May 30, 2020 / 11:18 AM IST
చైనా విద్యార్ధులపై నిషేధం…హాంకాంగ్ కు ప్రత్యేక హోదా తొలగింపు : ట్రంప్

Updated On : May 30, 2020 / 11:18 AM IST

హాంగ్‌కాంగ్‌కు అమెరికా క‌ల్పిస్తున్న ప్రత్యేక అధికారాల‌ను ర‌ద్దు చేయ‌నున్నట్లు శుక్రవారం(మే-30,2020) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యూఎస్ యూనివ‌ర్సిటీల్లో చేరే చైనీస్ విద్యార్థులను అడ్డుకోనున్నట్లు కూడా ఆయన తెలిపారు. హాంగ్‌కాంగ్ భ‌ద్రత బిల్లుకు చైనా ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో… చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హాంగ్‌కాంగ్‌ను చైనా ఆధీనంలోకి తీసుకుంటున్న తీరును ట్రంప్ ఖండించారు.

మాజీ బ్రిటీష్ కాలనీ అయిన హాంకాంగ్ విషయంలో చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టిన ట్రంప్…హాంగ్ కాంగ్ దీర్ఘకాలపు మరియు గర్వకారణమైన హోదాకు చైనా జోక్యం చేసుకోవ‌డం వ‌ల్ల విఘాతం ఏర్ప‌డుతున్నట్లు తెలిపారు. ఇది హాంగ్‌కాంగ్ ప్రజ‌ల‌కు,చైనా ప్రజలకు,నిజానికి ప్రపంచానికి విషాదం అని ట్రంప్ అన్నారు. హాంకాంగ్ కు వైవిధ్యమైన,ప్రత్యేక ట్రీట్మెంట్ ఇచ్చే పాలసీని తొలగించే ప్రక్రియను మొదలుపెట్టాలని తన యంత్రాంగాన్ని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇది… తమ అప్పగింత ఒప్పందం(extradition treaty) నుండి ద్వంద్వ వినియోగ సాంకేతిక పరిజ్ఞానాలపై ఎగుమతి నియంత్రణల వరకు పూర్తిస్థాయి ఒప్పందాలను ప్రభావితం చేస్తుందని ట్రంప్ తెలిపారు. మరోవైపు వివాదాస్పద హాంగ్‌కాంగ్ కొత్త సెక్యూర్టీ చ‌ట్టంకి సంబంధించి అమెరికా, బ్రిట‌న్ దేశాలు UN భ‌ద్ర‌తా మండ‌లిలో నిర‌స‌న వ్య‌క్తం చేశాయి

అమెరికా చట్టం కింద… హాంకాంగ్ ఇక ప్రత్యేక హోదాకు అర్హత సాధించదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీ బుధవారం కాంగ్రెస్‌(అమెరికా పార్లమెంట్)తో మాట్లాడుతూ అన్న విషయం తెలిసిందే. హాంకాంగ్ పై నియంత్రణను కఠినతరం చేయాలన్న చైనా ప్రకటనను ఏకపక్ష, వినాశకరమైనదిగా యూఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ఘాటుగా విమర్శించారు. మాజీ బ్రిటిష్ కాలనీ అయిన హాంకాంగ్ ఇకపై అమెరికా చట్టం కింద స్వయం ప్రతిపత్తిగా పరిగణించబడదని ఆయన పేర్కొన్నారు.హాంకాంగ్ పై తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవడానికి ఇటీవల చైనా..హాంగ్‌కాంగ్ కొత్త సెక్యూర్టీ చ‌ట్టంని తమ పార్లమెంట్ లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇది హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి, అక్కడి పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు హాంకాంగ్ ప్రత్యేక పాలనా ప్రాంతం(HKSAR)లో న్యాయవ్యవస్థ,భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని మెరుగుపర్చడానికి ఈ చట్టం తెచ్చినట్లు చైనా చెబుతోంది. హాంకాంగ్ ప్రాంతంలో చేపట్టే దేశద్రోహం,వేర్పాటువాద,విద్రోహ చర్యలు,విదేశీ జోక్యం,ఉగ్రవాదాన్ని నిషేధించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని చైనా అధికారులు తెలిపారు.

తిరిగి చైనా ఏలుబడిలోకి హాంకాంగ్

ఎకనామిక్ హబ్ గా పిలువబడే హాంకాంగ్.. స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజియన్(SAR) ఆఫ్ చైనాలో ఓ భాగంగా ఉంది. 1997 జూలై 1 నుంచి చైనా ఏలుబడిలోకి హాంకాంగ్ వెళ్లింది. అప్పట్నుంచి చైనాలో ‘ఒకే దేశం, రెండు విధానాలు’ అమలులో ఉంది. దీని ప్రకారం చైనాలోని మిగతా ప్రాంతాల్లో లేని కొన్ని స్వేచ్ఛలను హాంకాంగ్ లో పొందవచ్చు. ఇక్కడ పరిమిత స్థాయిలో ప్రజాస్వామ్యం,పౌర హక్కులు ఉంటాయి.

హాంకాంగ్ 150 ఏళ్లకుపైగా బ్రిటిష్ పాలనలో ఉండింది. 1842లో హాంకాంగ్ ద్వీపాన్ని చైనా.. బ్రిటన్‌కు అప్పగించింది. ఆ తర్వాత, 1898లో ‘న్యూ టెరిటరీస్‌’గా పిలిచే భూభాగాన్ని కూడా 99 సంవత్సరాల పాటు చైనా, బ్రిటన్‌కు లీజుకు ఇచ్చింది. కాలగమనంలో హాంకాంగ్ బాగా రద్దీగా ఉండే రేవు పట్టణంగా మారింది. 1950లలో దాని ఆర్థిక వ్యవస్థ ఊపందుకుని, తయారీ రంగ కేంద్రంగా అవతరించింది. పేదరికం, అస్థిరత కారణంగా చైనా ప్రధాన భూభాగం నుంచి చాలా మంది హాంకాంగ్‌కు వలస వచ్చేవారు.

లీజు గడువు దగ్గరపడటంతో 1980 దశకం ఆరంభంలో హాంకాంగ్ భవితవ్యంపై బ్రిటన్, చైనా చర్చలు మొదలుపెట్టాయి. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మొత్తం హాంకాంగ్‌ను తమకు అప్పగించాలని వాదించింది. ‘వన్ కంట్రీ, టూ సిస్టమ్స్’ (ఒక దేశం, రెండు వ్యవస్థలు) సూత్రం ప్రకారం 1997లో హాంకాంగ్ చైనాలో భాగంగా మారుతుందని ఇరు దేశాలూ అంగీకరించాయి. దీని ప్రకారం చైనాలో భాగంగా ఉన్నా, విదేశాంగ, రక్షణ వ్యవహారాలు తప్ప మిగతా అంశాల్లో హాంకాంగ్‌కు ‘అత్యున్నత స్థాయి స్వయంప్రతిపత్తి’ ఉండింది. ఫలితంగా హాంకాంగ్‌కు సొంతదైన న్యాయవ్యవస్థ, సరిహద్దులు ఏర్పడ్డాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, సభలు ఏర్పాటు చేసుకునే హక్కు సహా పౌరులకు వివిధ హక్కులు దక్కాయి.

హాంకాంగ్‌లో జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్) పెరగడం లాంటి కారణాలతో గత కొన్నేళ్లుగా హాంకాంగ్‌లో చైనీస్ సెంటిమెంట్ పట్ల వ్యతిరేకత పెరిగింది. కొందరు యువ ఆందోళనకారులు, చైనా నుంచి హాంకాంగ్‌కు స్వతంత్రం కావాలంటూ పిలుపునివ్వడం, చైనా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.  హాంకాంగ్ పై చైనా రుద్దుతున్న కొత్త చట్టాలపై అగ్రరాజ్యం అమెరికా గత కొన్ని రోజులుగా తన అభిప్రాయాలు చెబుతూ వస్తోంది. చైనాకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని.. డ్రాగన్ కంట్రీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ట్రంప్..అమెరికా వర్శిటీల్లోకి చైనీస్ విద్యార్థులను అడ్డుకునే నిర్ణయం తీసుకున్నారు.

Read: కొవిడ్-19 వ్యాక్సిన్ 99 శాతం వర్క్ అవుతుంది : చైనా