అమెరికాలో అనూహ్యం: అధికారాలు కోల్పోయిన అధ్యక్షుడు ట్రంప్

  • Published By: vamsi ,Published On : January 10, 2020 / 05:32 AM IST
అమెరికాలో అనూహ్యం: అధికారాలు కోల్పోయిన అధ్యక్షుడు ట్రంప్

Updated On : January 10, 2020 / 5:32 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ.. అమెరికాపై నిప్పులు కక్కుతుంది ఇరాన్.. ఇరాన్‌పై చండ్ర నిప్పులు కక్కుతుంది అమెరికా.. స్టాక్ మార్కెట్లు పడిపోవడం, బంగారం ధరలు, చమురు ధరలు భగ్గుమనడం, వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడడం.. అంతా పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అక్కడి పార్లమెంట్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న కొన్ని అధికారాలకు కత్తెర వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది అమెరికా పార్లమెంటు.

పార్లమెంట్ తీసుకున్న నిర్ణయంతో ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించే అధికారం కోల్పోయారు. ఈ మేరకు ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడానికి అవసరమైన అధికారాలను అమెరికా అధ్యక్షుడికి తగ్గించాలని హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 224 మంది ఆమోదం తెలపగా, 194 మంది వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించే అవకాశం కోల్పోయారు. ఆయన ఇప్పుడు ఏ నిర్ణయమూ సొంతంగా తీసుకోలేరు. ఈ తీర్మానానికి డెమోక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్లు కూడా మద్దతిచ్చారు.

ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాన్‌ హత్యకు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడమే కారణమని, ఆయన దూకుడును తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది పార్లమెంటు. సులైమానీ హత్యకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది షియాలు ఇప్పుడు అమెరికా ధోరణిపై రగిలిపోతున్నారు. ఈ క్రమంలో అమెరికా పార్లమెంట్ నిర్ణయంతో ఇరాన్‌, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం తొలగిపోయినట్లేనని అంటున్నారు. అమెరికా పార్లమెంట్ యుద్ధానికి ఆమోదం తెలిపితే తప్ప యుద్ధం వచ్చే అవకాశం లేదు. అది జరిగే అవకాశం కూడా లేదు.