ట్రంప్ అభిశంసనకు కారణం ఆ ఒక్కడే!

ట్రంప్ అభిశంసనకు కారణం ఆ ఒక్కడే!

Updated On : December 19, 2019 / 2:37 AM IST

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇక పదవి నుంచి తప్పుకోవాల్సిందే అంటున్నాయి డెమోక్రటిక్ పార్టీ వర్గాలు. దేశాధ్యక్షుడే దేశద్రోహం చేశాడంటూ పలు వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ చేసిన ఘన కార్యమేంటి.. ఎందుకని తప్పించాలనుకుంటున్నారు అనే ప్రశ్నలపై ఊహాగానాలతో సమాధానాలు వినిపిస్తున్నాయి. 

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీ‌తో జులై 25న ట్రంప్ మాట్లాడిన ఫోన్ కాల్ గురించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి ఓ ఫిర్యాదు అందింది. దానిపై విచారించేందుకు వైట్ హౌస్ ఆ ఫోన్ సంభాషణ వివరాలను బయటపెట్టింది. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేయబోయే జో బిడెన్‌పై అతనితో పాటు హంటర్ బిడెన్‌లపై విచారణలు చేపట్టాలని అందులో సమాచారం. 

ముందుగా పథకం ప్రకారం.. ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపేసి ఆ తర్వాత ఈ ఫోన్ సంభాషణ జరిగినట్లు భోగట్టా. బిడెన్‌పై విచారణ చేపడితేనే ఆ సాయాన్ని విడుదల చేస్తామని జెలెన్స్కీకి ట్రంప్ స్పష్టం చేశారట. వచ్చే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. 

బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ గతంలో ఓ ఉక్రెయిన్ గ్యాస్ సంస్థలో పనిచేశారు. జో బిడెన్, హంటర్ బిడెన్‌ల ప్రతిష్టను దెబ్బతీసేలా విచారణలు చేపట్టాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగత ప్రయోజనం మేరకే ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చారని, ఇది చట్ట విరుద్ధమని డెమొక్రటిక్ పార్టీ నాయకుల ఆరోపణలు.

అమెరికా చరిత్రలో ఇద్దరు అధ్యక్షులు మాత్రమే అభిశంసనకు గురయ్యారు. 1868లో ఆండ్రూ జాన్సన్ సెనేట్‌లో ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు. 1998 బిల్ క్లింటన్‌ను సెనేట్ దోషిగా తేల్చకపోవడంతో పదవి కోల్పోలేదు. 1974లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్.. అభిశంసనకు ముందే రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నారు.